ODI Highest Score List, ENG vs NED: పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లాండ్ తమకు ఎదురే లేదని చాటుతోంది! అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక స్కోరు నమోదు చేసింది. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న తొలి వన్డేలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 498 పరుగులు చేసింది. చరిత్రలో కనీవినీ ఎగరని రికార్డును సృష్టించింది. ఆ జట్టులో ఏకంగా ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడం గమనార్హం. ఫిలిప్ సాల్ట్ (122; 93 బంతుల్లో 14x4, 3x6), డేవిడ్ మలన్ (125; 109 బంతుల్లో 9x4, 3x6), జోస్ బట్లర్ (162 నాటౌట్; 70 బంతుల్లో 7x4, 14x6) దంచికొట్టారు. లివింగ్ స్టోన్ (66 నాటౌట్; 22 బంతుల్లో 6x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 26 సిక్సర్లు, 36 బౌండరీలు బాదేశారు.
టాస్ గెలిచిన నెదర్లాండ్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. అదే వారికి శాపంగా మారింది. భీకరమైన ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్లు వారికి చుక్కలు చూపించారు. డేవిడ్ మలన్ సిక్సర్ బాదితే ఓ బంతి పొదల్లోకి వెళ్లింది. దాన్ని ప్రత్యేకంగా వెతకాల్సి వచ్చింది. విచిత్రం ఏంటంటే జట్టు స్కోరు 1 వద్దే ఓపెనర్ జేసన్ రాయ్ (1) ఔయ్యాడు. అయితే ఇది తుపాను ప్రశాంతతలా అనిపించింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు దంచడమే పనిగా పెట్టుకున్నారు. మలన్, సాల్ట్ రెండో వికెట్‌కు 170 బంతుల్లో 222 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత బట్లర్, మలన్ కలిసి మూడో వికెట్‌కు 90 బంతుల్లో 184 రన్స్ కొట్టాడు. ఐదో వికెట్‌కు బట్లర్, లివింగ్‌స్టోన్ కలిసి 32 బంతుల్లో 91 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. ఇంగ్లాండ్ 14.1 ఓవర్లకు 100; 27.4 ఓవర్లకు 200; 37.6 ఓవర్లకు 300; 43.5 ఓవర్లకు 400; 50 ఓవర్లకు 498 కొట్టింది.