రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులు మొదలవుతున్నాయి. ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ రెడీ అవుతోంది. రెండేళ్లుగా కరోనా తీవ్రత నిరోధక చర్యల కట్టడి నిబంధనల వల్ల కోచింగ్ క్యాంపులు నిర్వహించలేదు. ఇప్పుడు పరిస్థితి కాస్త సద్దుమణగడంతో నిర్వహణకు సిద్ధమవుతున్నారు.
గత రెండేళ్లుగా సమ్మర్ కోచింగ్ క్యాంపులు లేవు. దాంతో ఇండోర్ స్టేడియాల్లో పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడ్డారు. అవసరమైన స్పోర్ట్స్ కిట్స్, సామగ్రి కోసం టెండర్లు పిలుస్తున్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంపులను విద్యార్థులకు ప్రతి ఏడాది నిర్వహించేవారు. 50 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న సమ్మర్ కోచింగ్ క్యాంప్స్‌ను ఉపయోగించుకొని ఎంతోమంది క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదిగారు. చాలా పతకాలు సాధించారు.
యాభైఏళ్ల క్రితం కేవలం పది ప్లేగ్రౌండ్లలో ఆరు క్రీడాంశాల్లో పదిహేను మంది కోచ్‌లతో తొలి సమ్మర్ కోచింగ్ క్యాంప్ మొదలైంది. అప్పట్లో దాదాపు పదహారు వందల మంది విద్యార్థులు వీటిని ఉపయోగించుకున్నారు. ఈ ఇరవై ఏళ్లలో వేలాది మంది వినియోగించుకుంటున్నారు. యాభైకిపైగా క్రీడాంశాల్లో వందల మంది కోచ్‌లు శిక్షణనిస్తున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా గ్రేటర్‌లోని అన్ని జోన్లలో సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ నిర్వహణ ఉంటుంది.
ఖైరతాబాద్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో ఏప్రిల్ 25న సమ్మర్ కోచింగ్ క్యాంప్ మొదలవుతుంది. చార్మినార్‌లోని కులీ కుతుబ్‌షా స్టేడియంలో 26, సికింద్రాబాద్‌లోని మారేడుపల్లి ప్లేగ్రౌండ్‌లో 27, కూకట్‌పల్లి, శేరిలింగం పల్లిలో పీజేఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 28, ఎల్‌బీనగర్‌లోని ఉప్పల్ స్టేడియంలో 29న క్యాంపులు ఆరంభమవుతాయి. చిన్నారులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు కోరుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లోకల్ జీహెచ్‌ఎంసీ అధికారి కార్యాలయంలో అడిగి తెలుసుకోవచ్చని... ఎలాంటి క్రీడలు, టైమింగ్స్ అన్ని వెల్లడిస్తారని తెలిపారు.