Harbhajan vs Ashwin Debate: రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin) బౌలింగ్‌ ఎదుర్కోవాలంటే తనకు భయమని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) అంటున్నాడు. లెఫ్ట్‌ హ్యాండర్లు అతడిని ఆడటం అత్యంత కష్టమని పేర్కొన్నాడు. అయితే హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh) బౌలింగ్‌ను చూడటం ఇష్టమని వెల్లడించాడు.


భారత్‌లోని అత్యుత్తమ ఆఫ్‌ స్పిన్నర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌, హర్భజన్‌ సింగ్‌ ముందుంటారు. వీరిద్దరికీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో తిరుగులేని రికార్డులు ఉన్నాయి. వీరిద్దరివీ ఒకే తరహా నైపుణ్యాలు కావడంతో ఒకరితో ఒకరిని పోలుస్తుంటారు. ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న భజ్జీని రిప్లేస్‌ చేసింది అశ్వినే కావడం ప్రత్యేకం.


శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డు అందుకున్నాడు. 434 టెస్టు వికెట్లు తీసి కపిల్‌ దేవ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్‌ఇండియా రెండో అత్యుత్తమ బౌలర్‌గా ఎదిగాడు. 619 వికెట్లతో అనిల్‌ కుంబ్లే టాప్‌లో ఉండగా 417 వికెట్లతో భజ్జీ నాలుగో స్థానంలో ఉన్నాడు. అశ్విన్‌, భజ్జీలో ఎవరు గొప్ప అన్న డిబేట్‌పై గౌతమ్‌ గంభీర్‌ స్పందించాడు.


'ఒక బ్యాటర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌ను ఫేస్‌ చేసేందుకు ఇష్టపడను. కానీ హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌ను చూడటం నాకిష్టం. యాష్ నా వికెట్‌ తీస్తాడని ఒక లెఫ్ట్‌ హ్యాండర్‌గా నేనెప్పుడూ ఫీలవుతుండే వాడిని. ఒక విశ్లేషకుడిగా మాత్రం భజ్జీకి ఓటేస్తా. అతడి బౌలింగ్‌లో బౌన్స్‌ ఉంటుంది. దూస్రా వేస్తాడు. బాల్‌ను డిప్‌ చేస్తాడు' అని గౌతీ అన్నాడు.


'లెఫ్ట్‌ హ్యాండర్‌కే కాదు ఎలాంటి బ్యాటర్‌కైనా అశ్విన్‌ బౌలింగ్‌ ఆడటం చాలా కష్టం. ఎందుకంటే అతడు అత్యంత కచ్చితత్వంతో, కఠినమైన లెంగ్తుల్లో, వేగంలో మార్పులు చేస్తూ బంతులేస్తాడు. హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌ మాత్రం చూడ్డానికి చాలా బాగుంటుంది' అని గంభీర్‌ చెప్పాడు. ప్రస్తుతం టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన తొమ్మిదో బౌలర్‌గా యాష్‌ ఉన్నాడు.