న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ (Chris Cairns)వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. ఆస్ట్రేలియాలోని కాన్‌‌బెర్రాలోని ఆస్పత్రిలో ప్రస్తుతం క్రిస్‌కి చికిత్స అందిస్తున్నారు. 51 ఏళ్ల క్రిస్‌కి గత వారం హార్ట్ ఎటాక్ వచ్చింది. ఇప్పటికే పలు సర్జరీలు చేసినా... అతడు రెస్పాండ్ అవడంలేదని న్యూజిలాండ్ మీడియా తెలిపింది. అంతేకాకుండా క్రిస్ గుండెకు సంబంధించిన Aortic Dissection సమస్యతో కూడా బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఇది చాలా ప్రాణాంతకమైనదిగా తెలుస్తోంది. 







1970 జూన్ 13న జన్మించిన క్రిస్ 1989లో న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. కివీస్ తరఫున క్రిస్ 215 వన్డేలు, 62 టెస్టులు, 2 T20లు ఆడాడు. న్యూజిలాండ్ తరఫున అతడు బెస్ట్ ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించాడు. అతడు రైట్ హ్యాండెడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అలాగే రైట్ హ్యాండెడ్ మీడియమ్ పేస్ బౌలర్. అతని స్ట్రైక్ రేట్ 85. వన్డేల్లో అతడు 4,950, టెస్టుల్లో 3,320 పరుగులు సాధించాడు. వన్డేల్లో 201, టెస్టుల్లో 218 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో క్రిస్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 115 కాగా టెస్టుల్లో 158. టెస్టుల్లో 13సార్లు 5వికెట్లు తీశాడు. అంతేకాదు ఏకంగా ఒక మ్యాచ్లో 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో ఒకసారి 5 వికెట్లు తీశాడు. 2006లో అతడు క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న క్రిస్ తన కెరీర్లో ఎక్కువగా వివాదాలకే గురయ్యాడు. 


క్రికెట్‌కి వీడ్కోలు పలికిన అనంతరం క్రిస్ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కొన్నాళ్ల పాటు టెలివిజన్లో క్రికెట్ విశ్లేషకుడిగానూ పని చేశాడు. కుటుంబాన్ని పోషించడం కోసం ట్రక్కు డ్రైవర్‌గా కూడా  పనిచేశాడు. సొంత ఇల్లు కూడా లేదు. ఒక్కోసారి ఇంటి అద్దె కట్టడానికి కూడా ఇబ్బంది పడేవారని అతని భార్య మెల్ క్రాసర్ తెలిపారు. 


క్రిస్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని తెలుసుకున్న అభిమానులు... అతడు కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం అత‌న్ని సిడ్నీలోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. అత‌ని ఆరోగ్యంపై న్యూజిలాండ్ ప్లేయ‌ర్స్ అసోసియేష‌న్ స్పందించ‌లేదు.