ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. నవంబర్ 20వ తేదీన రాత్రి 9:30 గంటలకు ఖతార్, ఈక్వెడార్‌ల మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్ మహా సంగ్రామం ప్రారంభం కానుంది. ప్రపంచంలోని 32 అత్యుత్తమ జట్లు ఈ టోర్నీలో కప్ కోసం తలపడనున్నాయి. నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. ఫిఫా ప్రపంచ కప్ 2022 గురించిన సమగ్ర సమాచారం ఇదే.
ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2022 గ్రూపులు
గ్రూప్ A: ఖతార్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్
గ్రూప్ B: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, వేల్స్
గ్రూప్ C: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలండ్
గ్రూప్ D: ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్మ్, ట్యునీషియా
గ్రూప్ E: స్పెయిన్, కోస్టా రికా, జర్మనీ, జపాన్
గ్రూప్ F: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా
గ్రూప్ G: బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్
గ్రూప్ H: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, రిపబ్లిక్ ఆఫ్ కొరియా
ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫార్మాట్
ప్రతి జట్టూ తన గ్రూపులోని మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ప్రతి గ్రూపు నుంచి టాప్-2 జట్లు రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంటాయి. ఇక్కడ నుంచి నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. గెలిచిన జట్లు టోర్నమెంట్‌లో ముందుకు వెళ్తాయి. ఓడిన జట్లు ఇంటి బాట పడతాయి. రౌండ్ ఆఫ్ 16లో మొత్తం 8 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. క్వార్టర్స్‌లో నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌ల విజేతలు సెమీస్‌లో అడుగుపెడతాయి.
ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2022 షెడ్యూల్
నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ మధ్య గ్రూప్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. మొదటి రోజు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడనున్నారు. ఆ తర్వాత నుంచి ప్రతి రోజూ రెండు నుంచి నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. డిసెంబర్ 9వ తేదీ, 10వ తేదీల్లో క్వార్టర్ ఫైనల్స్, 12వ తేదీ, 13వ తేదీల్లో సెమీస్ మ్యాచ్‌లు జరుగుతాయి. మూడో స్థానం కోసం డిసెంబర్ 17వ తేదీన సెమీస్‌లో ఓడిన జట్లు పోటీ పడతాయి. ఫైనల్ మహాసంగ్రామాన్ని డిసెంబర్ 18వ తేదీన నిర్వహించనున్నారు.
ఈ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి?
ఖతార్‌లోని 8 స్టేడియంల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో 64 మ్యాచ్‌లు జరగనున్నాయి. సెమీస్ వరకు చేరుకుంటే ప్రతి జట్టు కచ్చితంగా ఏడు మ్యాచ్‌లు ఆడుతుంది.
ప్రత్యక్ష ప్రసారం, స్ట్రీమింగ్ ఎందులో ఉంటాయి?
ఫిఫా వరల్డ్ కప్ 2022 బ్రాడ్‌కాస్ట్ రైట్స్‌ను వయాకాం 18 సంస్థ దక్కించుకుంది. స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్ 18 హెచ్‌డీ చానెళ్లలో దీన్ని లైవ్ చూడవచ్చు. వూట్ సెలెక్ట్, జియో టీవీ యాప్స్‌లో దీన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు.