FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. ఈ విజయంతో ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ హాకీ ప్రో లీగ్ లో భారత మహిళల హాకీ జట్టు తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.
ఈ మ్యాచ్ ఆరో నిమిషంలోనే భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. గుర్జిత్ కౌర్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. రెండో క్వార్టర్ ప్రారంభంలోనూ భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించగా, ఈసారి భారత జట్టు దానిని గోల్‌గా మలచలేకపోయింది. 22వ నిమిషంలో స్పెయిన్‌కు పెనాల్టీ కార్నర్ లభించినా, భారత్ బలమైన డిఫెన్స్ ఆ జట్టుకు అవకాశం ఇవ్వలేదు. రెండో క్వార్టర్‌లో భారత డిఫెండర్లు చెలరేగి జట్టు ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడంలో విజయం సాధించారు.
గోడలా నిలబడ్డ భారత డిఫెన్స్
మూడో క్వార్టర్ ప్రారంభంలో గుర్జిత్ పెనాల్టీ కార్నర్ ను మరోసారి అద్బుతంగా ఫ్లిక్ చేసింది. అయితే స్పానిష్ గోల్ కీపర్, గుర్జీత్ ప్రయత్నాన్ని సమర్ధంగా అడ్డుకుంది. ఆ తర్వాత స్పెయిన్ దాడులను తీవ్రతరం చేసింది. అయినప్పటికీ భారత డిఫెన్స్ ముందు ఆ జట్టు నిలవలేకపోయింది. ఆఖరి క్వార్టర్ లోనూ గోల్ చేసేందుకు స్పెయిన్ అమ్మాయిలు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ గోల్ కొట్టలేకపోయారు. దీంతో భారత్ 1-0 తో గెలుపొంది కప్పును గెలుచుకుంది.