కిందపడినప్పుడు కాళ్లకో చేతులకో గాయాలవుతాయి. రక్తం రావడం మొదలవుతుంది. ఆ రక్తం కొన్ని క్షణాలకే ఆగిపోతే మీకు విటమిన్ కె లోపం లేనట్టు. అలా కాకుండా రక్తం సన్నగా కొంత కాలం పాటూ వస్తూనే ఉందంటే అర్ధం మీకు విటమిన్ కె లోపం ఉన్నట్టు. విటమిన్ K అనేది ఒక ముఖ్యమైన పోషకం. ఇది అధిక రక్తస్రావం, గాయాలను నివారించడంలో సహాయపడుతుంది. రక్తం గడ్డకట్టడానికి, ఎముకల నిర్మాణానికి అవసరమైన వివిధ ప్రోటీన్లను తయారు చేస్తుంది. విటమిన్ కె అనేది కొవ్వులో కరిగే పోషకం. ఇది ఫైలో క్వినోన్, మెనా క్వినోన్స్ అనే రెండు రూపాల్లో లభిస్తుంది. ఫైలోక్వినోన్ అనేది మొక్కలు , ఆకుపచ్ ఆల్గేలలో అధికంగా లభిస్తుంది. ఇక రెండోది మెనాక్వినోన్స్ బ్యాక్టిరియా ద్వారా మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. విటమిన్ కె లోపం శరీరానికి రాకుండా ఉండాలంటే మీ డైట్లో చేర్చుకోవాల్సిన ఆహారాలు ఇవి. వీటిని తినడం అలవాటు చేసుకోవాలి.
ఆకు కూరలు
ఆకుపచ్చని ఆకుకూరలైన పాలకూర, బచ్చలి కూర, కాలే, క్యాబేజీ వంటి వాటిల విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. వీటిల్లో డైటరీ ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరం మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి.
బ్రోకలీ
బ్రోకలీ అత్యంత పోషకాలున్న కూరగాయలలో ఒకటి. బాగా ఉడికించి తింటే అనేక పోషకాలు మరియు ఖనిజాలను అందిస్తుంది. వాటిలో ఒకటి విటమిన్ K. ఒక కప్పు బ్రోకలీలో 220 mcg విటమిన్ K అందుతుంది. ఇది చాలా ఎక్కువనే చెప్పాలి.
కాలీఫ్లవర్
కాలీఫ్లవర్ తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్, కోలిన్, సల్ఫోఫేన్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు పచ్చి క్యాలీఫ్లవర్ 15.5 మైక్రోగ్రాముల విటమిన్ K ఉంటుంది. అదే ఒక కప్పు ఉడికించిన కాలీఫ్లవర్‌లో 17.1 మైక్రోగ్రాముల విటమిన్ K ఉంటుంది.
బ్రసెల్స్ మొలకలు
బ్రస్సెల్ మొలకలు చూడటానికి బఠానీ సైజులో ఉంటే క్యాబేజీల్లా ఉంటాయి. ఇందులో విటమిన్ K పుష్కలంగా ఉంటుంది. అలాగే ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి కూడా అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, క్యాన్సర్‌ల నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
పైన చెప్పినవన్నీ రోజూ తినక్కర్లేదు. కానీ వారంలో రెండు మూడు సార్లు తిన్నా చాలు. విటమిన్ లోపం రాకుండా ఉంటుంది.
Also read: తొక్కే కదా అని తీసిపారేయకండి, వాటిలోనే పోషకాలన్నీ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.