Indian Women's Hockey: భారత మహిళల హాకీ జట్టుకు నిరాశే ఎదురైంది. జపాన్ చేతిలో ఓటమితో భారత హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్ ఆశలు గల్లంతయ్యాయి. హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీ(Hockey Olympic Qualifiers)లో జపాన్ తో జరిగిన కీలక పోరులో 0-1 తేడాలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. దాంతో క్వాలిఫయర్ టోర్నీలో నాలుగో స్థానానికి పరిమితమైన మహిళల జట్టు పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించలేదు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాయి.
ఝార్ఖండ్ రాజధాని రాంచీ వేదికగా భారత్ తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో జపాన్ ఆధిపత్యం చెలాయించింది. తొలి క్వార్టర్ లో జపాన్ ప్లేయర్ కనా ఉరాటా పెనాల్టీ కార్నర్ తో గోల్స్ ఖాతా తెరిచింది. దాంతో జపాన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ మ్యాచ్ ముగిసేవరకూ భారత మహిళల టీమ్ గోల్ చేయడంలో విఫలమైంది. గురువారం జర్మనీతో జరిగిన సెమీఫైనల్స్‌లో భారత్ ఓటమి చెందడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఆ మ్యాచ్‌లో జర్మనీ చేతిలో 4-3 గోల్స్ తేడాతో భారత్ ఓడిపోయింది. దాంతో మూడో స్థానం కోసం మరో ఆసియా దేశం జపాన్‌తో పోరాడి ఓడి.. పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ను దక్కించుకోవడంలో విఫలమైంది.
రెండవ క్వార్టర్‌లో పరిస్థితి ఏం మారలేదు. భారత ప్లేయర్ లాల్‌రేమ్‌సమీ పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకోలేదు. జపాన్ గోల్‌కీపర్ అద్భుతంగా సేవ్ చేయడంతో ప్రత్యర్థి జట్టు ఆధిక్యం కొనసాగించింది. మూడో క్వార్టర్‌లో అంతే. చివరి 15 నిమిషాల్లో అంటే నాలుగో క్వార్టర్‌లో కనీసం ఒక గోల్ చేసి మ్యాచ్‌ను డ్రా చేస్తారని అభిమానులు భావించారు. కానీ గోల్స్ ఖాతా తెరిచే అవకాశాన్ని భారత మహిళలకు జపాన్ ఛాన్స్ ఇవ్వలేదు. చివరికి జపాన్ విజయం సాధించి పారిస్ ఒలింపిక్స్ కు చేరింది. -
భారత మహిళల జట్టు 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 4వ స్థానంలో నిలిచింది. దాంతో పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించి ఈసారి టైటిల్ సాధిస్తుందని ఆశలు చిగురించాయి. కానీ మూడేళ్ల తరువాత జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ మ్యాచ్ లో మెరుగ్గా రాణించినా.. చివరి మెట్టుపై భారత్ బోల్తా పడింది. మరోసారి అభిమానులకు నిరాశే ఎదురైంది.