Sourav Ganguly Resigned: బీసీసీఐ ఛైర్మన్‌ పదవికి సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) రాజీనామా చేశారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేశారని అంటున్నారు. ఆయన భవిష్యత్తు బాగుండాలని బోర్డు ఆకాంక్షించినట్టు మీడియాలో రాస్తున్నారు. బోర్డు కార్యదర్శి జే షా బీసీసీఐ కొత్త ఛైర్మన్‌గా ఎంపికయ్యారని బీసీసీఐ ప్రకటించినట్టు చెబుతున్నారు. అయితే ఇవన్నీ అవాస్తవాలు! ఓ నకిలీ ట్వీట్‌ను చూసి ఈ వార్తలు రాశారు.




ట్విటర్లో బీసీసీఐ పేరుతో ఓ పేరడీ అకౌంట్‌ ఉంది. దాని కింద @_BCCII అని ఉంటుంది. అసలైన ఖాతాకు ఇలా ఉండదు. పైగా బ్లూ టిక్‌ మార్క్‌ ఉంటుంది. ఆగస్టు 10న గంగూలీ రాజీనామా చేశారని పేరడీ ఖాతాలో ట్వీట్‌ చేశారు. 'న్యూస్‌: వ్యక్తిగత కారణాలతో బీసీసీఐ ఛైర్మన్‌ పదవికి సౌరవ్‌ గంగూలీ రాజీనామా చేశారు. ఆయన భవిష్యత్తు బాగుండాలని మేం కోరుకుంటున్నా. ఇక నుంచి కొత్త ఛైర్మన్‌గా జే షా ఉంటారు' అని పోస్టు చేశారు.




వాస్తవంగా బీసీసీఐకి ఛైర్మన్‌ ఉండరు. అధ్యక్ష్య కార్యదర్శులు ఉంటారు. అయితే చూడగానే నిజమైన అకౌంట్‌లా అనిపిస్తుండటంతో చాలామంది ఈ ట్వీట్‌ను వైరల్‌ చేశారు. కొన్ని మీడియా సంస్థలు నిజంగానే వార్తను ప్రచురించాయి.


ఇది పేరడీ ఖాతా అని తెలియడంతో క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నకిలీ వార్తలు ప్రచారం చేస్తుండటంతో ఖాతాను బ్లాక్‌ చేయాలని మరికొందరు సూచించారు. పరిస్థితి విషమించడంతో 'ఇది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం సృష్టించిన పేజీ. దయచేసి మేం చేసే ట్వీట్లను అధికారికమైనవిగా భావించొద్దు' అని సదరు సోషల్‌ మీడియా హ్యాండిల్‌ వివరించింది.




ఈ పేరడీ అకౌంట్‌ నుంచి మరికొన్ని అసంబద్ధమైన ట్వీట్లు రావడం గమనార్హం. 'ఐచ్ఛిక శిక్షణలో హార్దిక్‌ పాండ్య గాయపడటంతో విజయ్‌ శంకర్‌ను ఆసియాకప్‌కు ఎంపిక చేశారు' అని ఓ పోస్టు పెట్టింది. 'కుటుంబ సభ్యులతో మరింత సమయం గడిపేందుకు, దేశవాళీ లీగులపై దృష్టి కేంద్రీకరించేందుకు జస్ప్రీత్‌ బుమ్రాను బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టుల నుంచి విడుదల చేశాం' అని రెండు రోజుల ఓ ట్వీట్‌ రావడం తెలిసిందే.