ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా లండన్ బయల్దేరింది. నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నెల 12 నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభంకానుంది. లండన్‌లో ఈ టెస్టు జరగనుంది. అందుకోసమే కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు నాటింగ్‌హామ్ నుంచి లండన్ బయల్దేరింది.
శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ గాయపడ్డ నేపథ్యంలో వాళ్ల స్థానంలో శ్రీలంక నుంచి ఇంగ్లాండ్ చేరుకున్న పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ మాత్రం నాటింగ్‌హామ్‌లోనే మరికొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండనున్నారు. లండన్ బయలుదేరే ముందు భారత ఆటగాళ్లందరికీ సోమవారం కొవిడ్ టెస్టులు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ వచ్చిన అనంతరం ఉదయం 11 గంటలకు భారత జట్టు నాటింగ్‌హామ్ నుంచి లండన్ బయల్దేరింది.
పృథ్వీ, సూర్య ఈ నెల 3న నాటింగ్‌హామ్‌కు చేరుకోగా.. పది రోజుల క్వారంటైన్ 13న ముగుస్తుంది. 14 నుంచే వాళ్లిద్దరూ సాధన ప్రారంభిస్తారు. వీళ్లిద్దరూ ఈ నెల 25న లీడ్స్‌లో ఆరంభమయ్యే మూడో టెస్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లంక పర్యటనలో ఉన్నప్పుడు క్రునాల్ పాండ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ సమయంలో క్రునాల్‌తో క్లోజ్‌గా ఉన్న ఆటగాళ్లను గుర్తించిన మేనేజ్‌మెంట్ సిబ్బంది వాళ్లందరినీ క్వారంటైన్‌లో ఉంచింది. కొద్ది రోజుల క్వారంటైన్ తర్వాత పృథ్వీ, సూర్య లంక నుంచి నేరుగా ఇంగ్లాండ్ వెళ్లారు.
మరోవైపు BCCI అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ లార్డ్స్‌లో జరిగే రెండో టెస్టుకు అతిథిగా వెళ్లనున్నట్లు తెలిసింది. బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధూమల్‌తో కలిసి సౌరభ్ లండన్‌కు వెళ్లనున్నాడు.
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ తొలి టెస్టులో బూమ్రా 5 వికెట్లతో రాణించడంపై స్పందించాడు. ‘బుమ్రా చక్కటి బౌలర్. అతడి ఫాంపై నాకు ఎలాంటి ఆందోళనా లేదు. భవిష్యత్తులో అతడు ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని చేస్తాడు. 4, 6, 3.. వికెట్ల సంఖ్య ఏదైనా పెద్ద విషయం కాదు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో బుమ్రా మరోసారి మంచి ప్రదర్శన చేశాడు’ అని నెహ్రా చెప్పాడు. కాగా.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో బుమ్రా అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను కుప్పకూల్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో మెరిసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 5 వికెట్ల తీశాడు. మొదటి టెస్టులోనే 9 వికెట్లు తీసి మ్యాచ్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.