England New Captain Ben Stokes named new England test cricket captain taking over Joe Root: ఇంగ్లాండ్‌ టెస్టు క్రికెట్‌ జట్టు కొత్త కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్‌ (Ben Stokes) ఎంపికయ్యాడు. జో రూట్‌ (Joe Root) వారసుడిగా అతడికే ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు (ECB) ఓటేసింది. జట్టును నడిపించేందుకు ఈ సీనియర్‌ ఆల్‌రౌండరే సమర్థుడని భావించింది. కాగా తనను కెప్టెన్‌గా ఎంపిక చేసినందుకు బెన్‌స్టోక్స్‌ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు.


ఐదేళ్లుగా టెస్టు జట్టుకు నాయకత్వం వహిస్తున్న జో రూట్‌ రెండు వారాల క్రితమే పదవికి రాజీనామా చేశాడు. ఇంగ్లాండ్‌ ఆడిన చివరి 17 టెస్టుల్లో కేవలం ఒక మ్యాచే గెలవడం అతడిపై అసంతృప్తికి దారితీసింది. మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు పెరిగాయి. ప్రస్తుత టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆంగ్లేయులు ఆఖర్లో ఉన్నారు. దాంతో వెస్టిండీస్‌ పర్యటన నుంచి తిరిగొచ్చిన రూట్‌ ఆత్మావలోకనం చేసుకున్నాడు. బాగా ఆలోచించి నాయకత్వ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించాడు.


కొన్నేళ్లుగా బెన్‌స్టోక్స్‌ ఇంగ్లాండ్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఉంటున్నాడు. దాంతో సహజంగానే అతడు కెప్టెన్‌ అవుతాడని అంతా భావించారు. అందుకు తగ్గట్టే పురుషుల క్రికెట్‌ ఎండీ రాబ్‌ కీ అతడి పేరునే కెప్టెన్సీకి ప్రతిపాదించాడు. ఈసీబీ ఆ ప్రతిపాదనను ఆమోదించింది. దాంతో ఇంగ్లాండ్‌ 81వ టెస్టు కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్‌ ఎంపికయ్యాడు.




'టెస్టు కెప్టెన్సీ పాత్రను బెన్‌స్టోక్స్‌కు ఇవ్వడానికి నాకెలాంటి అభ్యంతరం కనిపించడం లేదు. తర్వాతి తరం టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన లక్షణాలు, మానసిక దారుఢ్యం అతడికి ఉన్నాయి. అతడు ఈ పదవిని చేపట్టేందుకు అంగీకరించినందుకు సంతోషంగా ఉంది. ఈ బాధ్యతలను మోసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతడీ పదవికి కచ్చితంగా అర్హుడు' అని రాబ్‌ కీ అన్నాడు.


'ఇంగ్లాండ్‌ టెస్టు జట్టును నడిపించే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నా. ఇది నిజంగా గొప్ప గౌరవం. ఈ సమ్మర్‌లోనే జట్టును నడిపించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను. ఇంగ్లాండ్‌ క్రికెట్‌కు జో రూట్‌ అందించిన సేవలకు ధన్యవాదాలు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆటకు అతడో గొప్ప అంబాసిడర్‌. ఒక నాయకుడిగా నా అభివృద్ధిలో అతడి పాత్ర ఎంతైనా ఉంది. ఇప్పుడు అతడు నాతోనే ఉంటాడు' అని బెన్‌స్టోక్స్‌ పేర్కొన్నాడు.