చెన్నైలో జరిగిన చెస్ ఒలంపియాడ్‌లో మహిళల బృందం కాంస్య పతకం సాధించింది. ఈ బృందంలో ప్రముఖ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక కూడా ఉన్నారు. తొమ్మిది నెలల గర్భంతో తను ఈ ఒలంపియాడ్‌లో మెడల్ సాధించడం విశేషం. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్‌ని హారిక పోస్ట్ చేశారు.
‘భారత మహిళ చెస్ బృందం తరఫున నేను ఆడటం ప్రారంభించి 18 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాల వయసు నుంచి నేను చెస్ ఆడుతున్నాను. ఇప్పటివరకు 9 ఒలంపియాడ్‌లు ఆడాను. భారత మహిళల జట్టు తరఫున పోడియంపై నిలబడాలన్నది నా కల. ఇన్నాళ్లకు అది నెరవేరింది.’
‘ఇది నాకు మరింత ఎమోషనల్ ఎందుకంటే నేను తొమ్మిది నెలల గర్భంతో పతకం సాధించాను. ఒలంపియాడ్ మనదేశంలో జరగనుందనే వార్త నేను విన్నప్పుడు మా డాక్టర్ కూడా ఎటువంటి అనారోగ్యం పాలవకుండా ఉంటే ఆడవచ్చని చెప్పారు. అప్పటినుంచి నా జీవితం ఒలంపియాడ్ చుట్టూ, అందులో పతకం సాధించడం చుట్టూనే తిరిగింది. నా ప్రతి అడుగూ అటువైపే సాగింది. శ్రీమంతం చేసుకోలేదు, పార్టీలు చేసుకోలేదు, సెలబ్రేషన్స్ చేసుకోలేదు, అన్నీ పతకం గెలిచాకేనని బలంగా డిసైడ్ అయ్యాను. నేను బాగా ఆడటం కోసం ప్రతి రోజూ కష్టపడ్డాను. ఈ క్షణం కోసం గత కొన్ని నెలలుగా కష్టపడ్డాను. దాన్ని సాధించాను. భారత మహిళల చెస్ బృందానికి మొదటి మెడల్ దక్కింది.’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
హారికతో పాటు భారత మహిళల బృందంలో కోనేరు హంపి, తాన్యా సచ్‌దేవ్, రమేష్ బాబు వైశాలి, భక్తి కులకర్ణి కూడా ఉన్నారు. ఫైనల్ రౌండ్‌లో భారత్ 1-3తో యూఎస్ఏ చేతిలో ఓటమి పాలైంది. దీంతో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హారిక ఏడు క్లాసికల్ గేమ్స్‌ను డ్రా చేసుకుని, చివరి రెండు గేమ్స్‌కు దూరంగా ఉంది.