Dinesh Karthik: టీమ్‌ఇండియా సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) గాల్లో తేలిపోతున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికైనందుకు సంతోషంతో కనిపిస్తున్నాడు. 'కలలన్నీ కచ్చితంగా నిజమవుతాయి' అంటూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టీ20 సిరీసులకు సెలక్టర్లు జట్లను ప్రకటించారు. కొన్ని నెలలుగా పరీక్షించిన ఆటగాళ్లకే అవకాశం ఇచ్చారు. ఐపీఎల్ తాజా సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున దంచికొట్టిన దినేశ్ కార్తీక్‌ను తీసుకున్నారు. ఏడాది క్రితం వరకు అతడు ప్రపంచకప్‌నకు ఎంపికవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తనదైన శైలిలో చెలరేగి, జట్టుకు అద్భుతమైన ఫినిషింగ్‌లు ఇచ్చి తనపై సెలక్టర్ల దృష్టి పడేలా చేసుకున్నాడు. ఆ తర్వాత ద్వైపాక్షిక సిరీసుల్లోనూ రాణించి నమ్మకం పెంచుకున్నాడు.
ప్రపంచకప్ జట్టును ప్రకటించాక దినేశ్ కార్తీక్ సోషల్ మీడియాలో స్పందించాడు. 'కలలన్నీ కచ్చితంగా నిజమవుతాయి' అంటూ ట్వీట్ చేశాడు. అంతకు ముందు నుంచీ డీకే ఇలాంటి నమ్మకంతోనే ఉన్న సంగతి తెలిసిందే.
'దేశానికి ఆడాలన్నదే నా అతిపెద్ద విజన్. తొందర్లోనే ప్రపంచకప్ ఉందని తెలుసు. అందులో ఆడాలని ఎంతగానో కోరుకుంటున్నాను. టీమ్‌ఇండియాను గీత దాటించాలని భావిస్తున్నా. భారత్ మల్టీ నేషన్ టోర్నీ గెలిచి చాన్నళ్లవుతోంది. జట్టుకు సాయం చేయాల్సిన మనిషిని నేనే అవ్వాలనుకుంటున్నా. ఇందుకోసం భిన్నంగా ప్రయత్నించాల్సిందే. మనల్ని గుర్తించేలా నిలబడాలి. అతడేదో ప్రత్యేకంగా చేసేలా కనిపిస్తున్నాడని అనిపించుకోవాలి. అందుకే ఇలా ఆడుతున్నా' అని ఐపీఎల్ టైమ్‌లో డీకే పేర్కొన్న సంగతి తెలిసిందే.
టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్
స్టాండ్ బై ప్లేయర్లు
మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్
అక్టోబర్ 16వ తేదీ నుంచి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. టీమిండియా తమ మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. అక్టోబర్ 23వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు నేరుగా సూపర్-12 మ్యాచ్ ఆడనుంది.
మొదట ఎనిమిది జట్లు క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. వీటిలో శ్రీలంక, వెస్టిండీస్, నమీబియా, యూఏఈ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు తలపడనున్నాయి. వీటిలో నాలుగు జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి.