Hardik Pandya Performance: హార్దిక్ పాండ్యా ప్రస్తుతం భారత వైట్ బాల్ క్రికెట్‌లో అత్యుత్తమ, అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్. హార్దిక్ పాండ్యా కెరీర్ ముగిసిపోయే స్థాయి గాయం నుంచి తిరిగి వచ్చాక కూడా అద్భుతమైన ఫామ్‌ను కనపరిచాడు. అతని బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చాలా మెరుగుపడింది.
ఇది కాకుండా గడిచిన ఒక సంవత్సరంలోనే హార్దిక్ పాండ్యా తన అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలను కూడా ప్రదర్శించాడు. భారత క్రికెట్ జట్టులోని మరో ఆల్‌రౌండర్ తనను హార్దిక్‌తో పోల్చుకున్నాడు. ఏదో ఒక రోజు అతను కూడా హార్దిక్ పాండ్యా లాగా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటానని చెప్పాడు.
హార్దిక్ పాండ్యా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు, బంతిని ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ చేయగలడు. కొత్త బంతితో బౌలింగ్ దాడిని కూడా ప్రారంభించగలడు. బ్యాటింగ్‌లో మిడిల్ ఆర్డర్‌ను హ్యాండిల్ చేయడంతో పాటు వేగంగా ఫినిషింగ్ కూడా చేయగలడు.
ఈ నైపుణ్యాలన్నీ కాకుండా అతను మంచి కెప్టెన్సీని కూడా చేయగలడు. అందువల్ల, హార్దిక్ పాండ్యా వన్డే, టీ20 ఫార్మాట్లకు పూర్తి స్థాయి ఆల్ రౌండ్ క్రికెటర్. భారత క్రికెట్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన మరో ఆల్ రౌండర్ దీపక్ చాహర్... హార్దిక్ పాండ్యాతో సమానమైన నైపుణ్యాలు తనకు కూడా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.
దీపక్ చాహర్ మాట్లాడుతూ, "ఈ ప్రక్రియ చాలా సులభం. నేను భారతదేశం కోసం ఆడని సమయంలో కూడా, ఇదే విధానాన్ని అనుసరించాను. ఇప్పుడు కూడా అది మారలేదు. నేను నా రాష్ట్ర జట్టు కోసం ఆడినప్పుడు ఒకరోజు నేను ఇండియాకు ఆడతాను అని నా సహచరులకు చెప్పేవాడిని. వారు నన్ను చూసి నవ్వేవారు. నేను ఇప్పటికీ నన్ను నమ్ముతున్నాను. నేను గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసురుతూ కూడా రెండు వైపులా స్వింగ్ చేయగలనని చెప్పాను. అప్పుడు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేయడంలో నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను కొంచెం బ్యాటింగ్ చేయగలిగితే నా స్థానం కచ్చితంగా భారత జట్టులో ఉంటుంది. అది ఇప్పుడు అయినా కావచ్చు లేదా 10 నుంచి 15 సంవత్సరాలలో అయినా కావచ్చు. ఆ స్థాయికి చేరుకోవాలి అనుకుంటున్నాను. నేను ఆ స్థాయికి చేరుకున్న తర్వాత కూడా నా నుంచి మంచి ప్రదర్శన వస్తుంది. నేను అప్పటికీ 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలగాలి. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంతో పాటు బ్యాట్‌తో కూడా పరుగులు చేయాలనుకుంటున్నాను." అన్నాడు.
దీపక్ చాహర్ ఇంకా మాట్లాడుతూ "హార్దిక్ పాండ్యాను చూడండి. అతను ఈ మూడు పనులను చాలా బాగా చేయగలడు. దీని కారణంగా రాబోయే ఒకట్రెండు సంవత్సరాల వరకు అతనిని ఎవరూ భర్తీ చేయలేరు. అతను నంబర్ వన్ ఆల్ రౌండర్. ఆ తర్వాత నేను లేదా మరెవరైనా ఈ మూడు పనులను ఎవరైనా చేస్తే వారికి చోటు ఖాయం అవుతుంది." అని పేర్కొన్నాడు.