MI Cape Town Players: అదేంటీ..! గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడుతున్న రషీద్‌ ఖాన్‌ ముంబయిలో చేరాడా? కోట్లు పెట్టి కొనుక్కున్న లియామ్‌ లివింగ్‌స్టన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ వదిలేసుకుందా? చెన్నై చిచ్చరపిడుగు సామ్‌ కరణ్‌, పంజాబ్‌ పేసర్‌ కాగిసో రబాడా ముంబయి ఇండియన్స్‌లోకి ఎందుకెళ్లారు? అని సందేహ పడుతున్నారా? అదేం లేదండి! వీరంతా సీఎస్‌ఏ టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌కు ఆడబోతున్నారు! అదీ సంగతి!


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను ఆదర్శంగానే తీసుకొని ఇప్పటికే చాలా దేశాలు సొంత టీ20 లీగులను మొదలు పెట్టాయి. క్రికెట్‌ దక్షిణాఫ్రికా సైతం ఇదే బాటలో నడవనుంది. అతి త్వరలో CSA T20 లీగ్‌ నిర్వహింబోతోంది. ఇప్పటికే వేలం వేయగా ఆరు ఫ్రాంచైజీలను ఐపీఎల్‌ యాజమాన్యాలే దక్కించుకున్నాయి. కేప్‌టౌన్‌ ఫ్రాంచైజీని ముంబయి ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. ఆటగాళ్ల వేలానికి ముందే మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌, సామ్‌ కరణ్‌, కాగిసో రబాడా, డీవాల్డ్‌ బ్రూవిస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆ జట్టు తెలిపింది.


లీగ్‌ నిబంధనల ప్రకారం ఆరు ఫ్రాంచైజీలు ముందుగానే ఐదుగురు ఆటగాళ్లను తీసుకోవచ్చు. అందులో ముగ్గురు విదేశీయులు, ఒక దక్షిణాఫ్రికా ఆటగాడు, ఇంకా అరంగేట్రం చేయని సఫారీ క్రికెటర్‌ను తీసుకోవాలి. అందరి కన్నా ముందుగా ఎంఐ కేప్‌టౌన్‌ ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకుంది.


'ఎంఐ కేప్‌టౌన్‌ జట్టు నిర్మాణం మొదలు పెట్టడం ఉత్సాహంగా ఉంది' అని రిలయన్స్‌ జియో ఛైర్మన్‌, ఎంఐ కేప్‌టౌన్‌ యజమాని ఆకాశ్‌ అంబానీ అన్నారు. 'మొదట కీలక ఆటగాళ్లను తీసుకోవడం ముంబయి ఇండియన్స్‌ తత్వం! వారిని ఆధారంగా చేసుకొని మిగిలిన జట్టును నిర్మిస్తాం. రషీద్‌, కాగిసో, లియామ్‌, సామ్‌ను ఎంఐలోకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే మాతో ఉన్న డీవాల్డ్‌ బ్రూవిస్‌ మాలాగే సరికొత్త ప్రయాణం మొదలు పెడతాడు' అని ఆయన పేర్కొన్నారు.


ఇప్పటికే 30 మంది కీలక ఆటగాళ్లతో ఒప్పందాలు కుదిరాయని సీఎస్‌ఏ లీగ్‌ నిర్వాహకులు ప్రకటించారు. ఒక్కో జట్టు 17 మందిని తీసుకోవచ్చని వెల్లడించింది. జోస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, డుప్లెసిస్‌, డికాక్‌, డేవిడ్‌ మిల్లర్‌, ఇయాన్‌ మోర్గాన్‌, జేసన్‌ హోల్డర్‌, జేసన్‌ రాయ్‌ లీగులో ఆడబోతున్నారని తెలిసింది.


లివింగ్‌స్టన్‌, జోస్‌ బట్లర్‌ చెరో 5 లక్షల డాలర్లు అందుకోబోతున్నారు. మొయిన్‌ అలీ 4 లక్షల డాలర్లు, డుప్లెసిస్‌ 3.5 లక్షలు, రబాడా, డికాక్‌, మిల్లర్‌, మోర్గాన్‌, కరన్‌ తలో 3 లక్షల డాలర్లు ఆర్జిస్తారు. ఇప్పటికైతే ఇంగ్లాండ్‌ నుంచి 11, శ్రీలంక నుంచి 10 మంది సంతకాలు చేశారు. పాకిస్థానీ వాళ్లైతే ఎవరూ లేరు. రెండు, మూడు వారాల్లో ఆటగాళ్ల వేలం జరుగుతుంది. 2023 జనవరిలో లీగ్‌ మొదలవుతుంది.


దక్షిణాఫ్రికాలో అతిత్వరలో నిర్వహించే దేశవాళీ టీ20 లీగ్‌లో ఆరు ఫ్రాంచైజీలను ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ యజమానులు దక్కించుకున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ లీగ్‌ మొదలవుతుందని తెలిసింది.


ఐదు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ జట్టును ఎంత బాగా నడిపిస్తుందో అందరికీ తెలిసిందే. వీరు న్యూలాండ్స్‌ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు. ఇక జొహన్నెస్‌బర్గ్‌ ఫ్రాంచైజీని చెన్నై సూపర్‌కింగ్స్‌ దక్కించుకుంది. దిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ ప్రిటోరియా ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. అరంగేట్రం సీజన్లోనే అదరగొట్టిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ యజమానులు డర్బన్‌ జట్టును దక్కించుకున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓనర్లైన సన్‌ నెట్‌వర్క్‌ కెబ్రెహా, రాజస్థాన్‌ రాయల్స్‌ పార్ల్‌ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయి.