జింబాబ్వే క్రికెట్‌(Zimbabwe Cricket:)లో డోపింగ్‌ (Doping)కలకలం రేగింది. ఏకంగా ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించారని రుజువు కావడంతో జింబాబ్వే క్రికెట్‌ బోర్డు.. ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లను సస్పెండ్‌ చేసింది. ఫిట్‌నెస్ కోసం నిషేధిత డ్రగ్స్ వాడి ఇద్దరు జింబాబ్వే క్రికెట‌ర్లు డోప్ ప‌రీక్షలో ప‌ట్టుబ‌డ్డారు.


మాదక ద్రవ్యాలు వినియోగించిన క్రికెటర్లు


జింబాబ్వే ఆల్‌ రౌండ‌ర్లు వెస్లీ మ‌ధేవెరె(Wesley Madhevere), బ్రాండ‌న్ మవుతా(Brandon Matta) నిషేధిత డ్రగ్ తీసుకున్నట్లు జింబాబ్వే క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. దాంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ ఇద్దరిని స‌స్ఫెండ్ చేసింది.  వెస్లీ మధేవెరె, బ్రాండన్ మవుటా బ్లడ్‌ శాంపిల్స్‌లో మాదకద్రవ్యాలు వినియోగించినట్లు తేలడంతో ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మధేవెరె, మవుటాలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ZC ప్రకటించింది. విచార‌ణ పూర్తయ్యే వ‌ర‌కూ క్రికెట్‌కు సంబంధించిన కార్యక‌లాపాల్లో పాల్గొన‌వ‌ద్దని ఆదేశించింది. త్వర‌లోనే జింబాబ్వే క్రికెట్ బోర్డు క్రమ‌శిక్షణ క‌మిటీ ముందు వెస్లీ, మ‌వుతా హాజ‌రు కానున్నారు. అ క‌మిటీ ముందు వీళ్లు త‌మ వాద‌న‌లు వినిపిస్తారు. . అనంత‌రం ఈ ఇద్దరిపై ఎన్ని రోజుల నిషేధం విధిస్తారనేది కమిటీ నిర్ణయం తీసుకోనుంది. 


 


జట్టుకు దూరంగా మధేవెరె 


ఇప్పటివ‌ర‌కూ వెస్లీ జింబాబ్వే త‌ర‌ఫున అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 98 మ్యాచ్‌లు ఆడాడు. మధేవెరె  కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. మధేవెరె జింబాబ్వే తరఫున 2 టెస్ట్‌లు, 36 వన్డేలు, 60 టీ20లు ఆడి 26 వికెట్లు, 1100 పైగా పరుగులు సాధించాడు. 26 ఏళ్ల మవుటా ఇటీవలే ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించగా.. లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌ అయిన మవుటా జింబాబ్వే తరఫున 4 టెస్ట్‌లు, 12 వన్డేలు, 10 టీ20లు ఆడి ఓవరాల్‌గా 26 వికెట్లు పడగొట్టాడు. మవుటా టెస్ట్‌ల్లో ఓ హాఫ్‌ సెంచరీ కూడా చేశాడు. జింబాబ్వేచ్‌ డేవ్‌ హటన్‌ బాధ్యతల నుంచి తప్పుకోగా.. తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా  వాల్టర్‌ చాగుటా నియమితుడయ్యాడు. 


జింబాబ్వే జట్టుకు మరో భారీ షాక్‌


వన్డే వరల్డ్‌కప్‌, టీ20 వరల్డ్‌కప్‌లకు అర్హత సాధించలేకపోవడంతో పాటు స్వదేశంలో నమీబియా, ఐర్లాండ్‌ లాంటి చిన్న జట్ల చేతిలో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న జింబాబ్వే జట్టుకు మరో భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శత విధాల ప్రయత్నించిన ప్రధాన కోచ్‌ డేవ్‌ హటన్‌ తప్పనిసరి పరిస్థితుల్లో తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్‌ బోర్డు ఇవాళ అధికారికంగా ప్రకటించింది. జింబాబ్వే జట్టులో కొత్తగా కెప్టెన్‌గా నియమితుడైన సికందర్‌ రజా ఒక్కడే రాణిస్తుండగా, మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేస్తున్నారు. 


ఇటీవలే జింబాబ్వే ప‌ర్యట‌న‌ను ఐర్లాండ్ విజయవంతంగా ముగించింది. టీ20 సిరీస్‌తో పాటు వ‌న్డే సిరీస్‌లోనూ ఐర్లాండ్ విజేత‌గా నిలిచి సగర్వంగా టూర్ ని ముగిచింది. హ‌రారే స్పోర్ట్స్ క్ల‌బ్‌ లో ఆదివారం జ‌రిగిన‌ సిరీస్ డిసైడ‌ర్‌లో అద్భుత విజ‌యంతో ఐర్లాండ్‌ చ‌రిత్ర సృష్టించింది. కీల‌క పోరులో స‌మిష్టిగా రాణించిన పాల్ స్టిర్లింగ్ సేన‌ 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. త‌ద్వారా జింబాబ్వే గ‌డ్డపై వ‌న్డే సిరీస్ విజ‌యాన్ని న‌మోదు చేసింది.