వరుస ఓటములతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ జట్టు(Pakistan Cricket team)కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గత 76 రోజులుగా ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేక చతికిల పడ్డ దాయాది జట్టులో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వన్డే వరల్డ్‌కప్‌లో ఓటమితో పాక్‌ కెప్టెన్సీ పదవికి బాబార్‌ ఆజమ్‌ రాజీనామా చేసినప్పుడు మొదలైన ఈ రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాక్‌లో విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వేళ.. ఇప్పటికే ముగ్గురు సిబ్బంది రాజీనామా చేయగా తాజాగా పాక్‌ క్రికెట్‌ బోర్డులో పెద్ద తలకాయ కూడా రాజీనామా చేయడం సంచలనం రేపుతోంది.


పీసీబీ ఛైర్మన్‌ రాజీనామా 
పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు( Pakistan Cricket board)  చైర్మన్ జ‌కా అష్రఫ్‌(Zaka Ashraf) తన పదవికి రాజీనామా చేశారు. ప‌ద‌వి చేప‌ట్టి ఏడాది కాక‌ముందే పీసీబీ మేనేజ్‌మెంట్ క‌మిటీ నుంచి అష్రఫ్ వైదొలిగాడు. పాక్ జ‌ట్టు వ‌రుస వైఫ‌ల్యాల నేప‌థ్యంలో అష్రఫ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక్క విజయం కోసం సుమారు రెండున్నర నెలలుగా పాక్‌ అభిమానులు కళ్లు కాయాలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయినా ఒక్క విజయం కూడా నమోదు కాలేదు. పాక్‌ జట్టు ఆటతీరు సహా పీసీబీ అధ్యక్షుడిగా అష్రఫ్ ప‌నితీరుపై కొంద‌రు అసంతృప్తిగా ఉన్నార‌ు. పాక్ క్రికెట్‌ను వృద్ధిలోకి తెద్దామ‌నుకున్నాను కానీ ఆ విధంగా ప‌ని చేయ‌డం తనకు సాధ్యం కాలేదని... తన స్థానంలో పీసీబీ ఛైర్మన్‌గా ఎవ‌రిని నామినేట్ చేయాల‌నేది ప్రధాన మంత్రి నిర్ణయం తీసుకుంటారని రాజీనామా అనంతరం అష్రఫ్ తెలిపాడు. గ‌డిచిన రెండేళ్ల కాలంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ముగ్గురు అధ్యక్షులు మారారు. ర‌మిజ్ రాజా, న‌జం సేథీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వైదొలగగా... తాజాగా అష్రఫ్‌ కూడా పదవికి రాజీనామా చేశాడు. 


ముగ్గురు రాజీనామా
పాకిస్థాన్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెట్‌లో భారీ మార్పులు చేయగా.. తాజాగా కీలక పదవుల నుంచి మిక్కీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌ బర్న్, ఆండ్రూ పుట్టిక్‌ నుంచి వైదొలిగారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వీరు రాజీనామా చేసినట్లు అధికారికంగా ధృవీకరించింది. ప్రపంచకప్‌లో పాక్‌ క్రికెట్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన మికీ ఆర్థర్‌, గ్రాంట్ బ్రాడ్‌బర్న్‌, ఆండ్రూ పుట్టిక్‌ రాజీనామా చేశారు. పీసీబీ వారి రాజీనామాలను ఆమోదించినట్లు పేర్కొంది. గతేడాది ఏప్రిల్‌లో మికీ ఆర్థర్‌ పాక్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. బ్రాడ్‌బర్న్‌ను ప్రధాన కోచ్‌, పుట్టిక్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా పీసీబీ నియమించింది. వరల్డ్‌ కప్‌లో జట్టు దారుణంగా ఆడటంతో ఈ ముగ్గురూ కొనసాగేందుకు ఇష్టపడక రాజీనామాలు సమర్పించేశారు. 2016 నుంచి 2019 మధ్య పాకిస్థాన్‌ జట్టుకు మిక్కీ ఆర్థర్ కోచ్ గా పని చేశాడు. ఏప్రిల్ 2023లో పాక్ జట్టులో డైరెక్టర్‌గా చేరారు. ఆర్థర్ 2016 నుంచి 2019 వరకు పాకిస్తాన్ మెన్స్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. ఇతను కోచ్ గా ఉన్న సమయంలో పాకిస్తాన్ ICC టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడంతో పాటు 2017 ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆర్థర్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లకు ప్రధాన కోచ్‌గా కూడా పనిచేశాడు.