Yograj Singh: యువరాజ్ సింగ్ చనిపోయినా ఫీలయ్యేవాడిని కాను - తండ్రి యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
Yograj Singh Comments: భారత క్రికెట్లో సిసలైన ఆల్ రౌండర్లలో యువరాజ్ సింగ్ ఒకడు. వైట్ బాల్ క్రికెట్లో తన ముద్ర చూపించాడు. ఆయన తండ్రి యోగరాజ్ సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Yograj Singh Sensational Comments: బారత క్రికెట్లో యువరాజ్ సింగ్‌ది ప్రత్యేకమైన పాత్ర.. 1983 తర్వాత ప్రపంచకప్ సాధించిన రెండు సందర్భాల్లోనూ తను అసమాన ప్రతిభ కనబర్చాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో కీలకమైన మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. అలాగే ఆసీస్‌తో సెమీస్‌లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. ఇక సొంతగడ్డపై 2011 వన్డే ప్రపంచకప్ భారత్ గెలవడంలో యువరాజ్‌ది కీలకపాత్ర. ఆల్‌రౌండర్‌గా అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును దక్కించుకున్నాడు. టోర్నీ ముగిశాక తను క్యాన్సర్ బారిన పడ్డాడని, ఒకవైపు రక్తం కక్కుకుంటూనే టోర్నీలో జట్టును గెలిపించేందుకు శతవిథాలా ప్రయాత్నించాడని తెలిసింది. ఈ విషయంపై తాజాగా అతని తండ్రి, మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ స్పందించాడు.
చనిపోయినా కప్ కొట్టాలనుకున్నా..
క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్న యువరాజ్‌ను చూసి తానెంతో చలించిపోయానని యోగరాజ్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ క్యాన్సర్ ముదిరి టోర్నీలో చనిపోయి, దేశానికి కప్పు అందించినా తాను గర్వపడి ఉండేవాడినని తెలిపాడు. ఇప్పుడు కూడా యువరాజ్ అంటే తనకు ఎంతో గర్వమని, టీమ్ సాధించిన రెండు ప్రపంచకప్పుల్లో తన పాత్రతో పాటు, జట్టుకు ఎన్నో విజయాలు అందించాడని కొనియాడాడు. 2011 ప్రపంచకప్ మధ్యలో క్యాన్సర్‌తో తను ఇబ్బంది పడుతున్నప్పుడు, చనిపోయినా ఫర్వాలేదు, కప్పు కొట్టాలని తనను మోటివేట్ చేసినట్లు పేర్కొన్నాడు. ఈ టోర్నీలో యువరాజ్ 90కి పైగా సగటుతో 362 పరుగులు చేశాడు. 86 స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడాడు. అలాగే నమ్మకమైన మిడిలార్డర్ బ్యాటర్‌గా సత్తా చాటాడు.
రిటైర్మెంట్‌పై వివాదం..
మరోవైపు కోహ్లీ కారణంగానే యూవీ అర్థాంతరంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడని విమర్శలున్నాయి. ముఖ్యంగా భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఫిట్ నెస్ లెవల్ బాగా పెరిగింది. స్వయంగా సూపర్ ఫిట్‌గా తయారై కోహ్లీ.. టీమిండియా ప్లేయర్లకే గాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులకు రోల్ మోడల్‌గా నిలిచాడు. అతను జట్టు ఎంపికలో కఠినమైన యోయో టెస్టును ప్రవేశపెట్టాడు. అందులో సాధించిన స్కోరు ఆధారంగానే టీమ్ ఎంపికలో అవకాశం కల్పించాడు. అయితే అప్పటికే క్యాన్సర్ బారిన యువరాజ్‌కి ఈ టెస్టును క్రాక్ చేయడం కష్టంగా మారిందని, అతని ఊపిరితిత్తులు అంత సామర్థ్యాన్ని చూపించలేదని మాజీ క్రికెటర్ ఉతప్ప పేర్కొన్నాడు. కనీసం అతని ఆరోగ్య లెవల్ ప్రకారం కొన్ని సడలింపులు ఇచ్చి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాడు.
నిజానికి యువరాజ్ కూడా ఫిట్ నెస్ లెవల్ క్రాక్ చేయడం కోసం కష్టపడ్డాడని ఒకట్రెండు పాయింట్లతో మిస్సయ్యేవాడని, ఈ విషయంలో అతడికి కొన్ని మినహాయింపులు కోహ్లీ కానీ, టీమ్ మేనేజ్మెంట్ కానీ ఇస్తే బాగుండేదని పేర్కొన్నాడు. అయితే మొత్తానికి 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఫిట్‌నెస్ టెస్టు పాసై, జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే ఆ సిరీస్‌లో విఫలవమవ్వడంతో తనను జట్టు నుంచి డ్రాప్ చేశారు. ఆ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ కాలేక, 2019లో యువీ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011 నుంచి 2017 వరకు యూవీ కొన్ని మ్యాచ్ లే ఆడటం గమనార్హం.