WTC Final 2023: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, లేటు వయసులో నాటు కొట్టుడు కొడుతున్న  గుజరాత్ ఓపెనర్ వృద్దిమాన్ సాహా..  ఆదివారం అహ్మదాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ముగిసిన మ్యాచ్‌లో  వీరవిహారం  చేశాడు.  43 బంతుల్లోనే 10 బౌండరీలు,  4 సిక్సర్ల సాయంతో  81 రన్స్  చేశాడు.   సాహా మెరుపు ఇన్నింగ్స్‌తో  గుజరాత్ భారీ స్కోరుకు బాటలుపడ్డాయి.  అవతలి ఎండ్‌లో శుభ్‌మన్ గిల్‌ను నిల్చోబెట్టి మరీ సాహా  వీరబాదుడు బాదాడు.  


సాహానే బెస్ట్.. 


సాహా పవర్ ప్యాక్డ్ ఇన్నింగ్స్  గుజరాత్‌కు  ఏ మేరకు ఉపయోగపడిందన్న సంగతి పక్కనబెడితే ఈ  సూపర్ షో  తర్వాత టీమిండియా ఫ్యాన్స్ మాత్రం అతడిని తిరిగి టీమిండియాకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.  త్వరలో  ఇంగ్లాండ్ వేదికగా జరుగబోయే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌లో   సాహాను ఆడించాలని కోరుతున్నారు. గాయపడ్డ కెఎల్ రాహుల్ ప్లేస్‌ను సాహా భర్తీ చేయగలడని  ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.  టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కూడా సాహా ప్రదర్శనకు ముగ్దుడై తన ఇన్‌స్టా స్టోరీస్ లో సాహా ఫోటో షేర్ చేస్తూ ‘వాట్ ఎ ప్లేయర్ @వృద్ధి’అని  షేర్ చేశాడు.  


 






టీమిండియా మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ ఈ మేరకు  ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘సాహా ఫర్ డబ్ల్యూటీసీ ఫైనల్స్’ అని ట్వీట్ చేశాడు.  ఈ ట్వీట్ వైరల్ అయ్యాక  టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.   ఇందుకు సంబంధించిన  ట్వీట్స్  కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.


భరత్ ఉన్నా అనుమానమే..!


ఇటీవలే  లక్నో - బెంగళూరు మధ్య ముగిసిన మ్యాచ్‌లో  ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెఎల్ రాహుల్ ఐపీఎల్-16తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు కూడా దూరమైన విషయం తెలిసిందే.  వాస్తవానికి డబ్ల్యూటీసీ ఫైనల్స్ కోసం  ఇదివరకే ప్రకటించిన  15 మంది సభ్యుల జట్టులో కెఎల్ రాహుల్ తో పాటు ఆంధ్రా క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ కూడా ఉన్నాడు.  కానీ కొద్దిరోజుల క్రితమే భారత్ - ఆస్ట్రేలియా మధ్య ముగిసిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భరత్  ఆశించిన స్థాయిలో రాణించలేదు.  కెఎల్ రాహుల్ నే  వికెట్  కీపర్ గా ఆడించాలని చూసిన టీమిండియాకు అతడి గాయంతో  కొత్త సమస్యలు ఎదురుపడ్డాయి.   


 






ఇక పదేండ్ల తర్వాత  ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలని కలలు కంటున్న టీమిండియాకు ఈ గాయాల బెడద వేధిస్తున్నా  అనుభవజ్ఞులైన ఆటగాళ్ల అవసరం ఎంతైనా ఉంది. శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ ల గాయాలు  టీమిండియాను భయపెడుతున్నా రహానే మళ్లీ టీమ్ లోకి రావడం, కౌంటీ క్రికెట్ లో ఛతేశ్వర్ పుజారా  సెంచరీల వర్షం  కురిపిస్తుండటం (నాలుగు మ్యాచ్ లలో మూడు  శతకాలు) భారత్ కు కలిసొచ్చేవే. ఐపీఎల్ లో శుభ్‌మన్ గిల్, రహానే,  కోహ్లీలు ఫామ్ లో ఉన్నా కెప్టెన్  రోహిత్ శర్మ  సున్నాలు చుడుతుంటం ఆందోళన కలిగిస్తున్నది.  


 






రీఎంట్రీ ఇస్తాడా..? 


టీమిండియా మాజీ సారథి ధోని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన  తర్వాత భారత జట్టులోకి రెగ్యులర్ వికెట్ కీపర్ (టెస్టులు)గా వచ్చిన సాహా.. 40 టెస్టులలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.  కానీ పంత్ రాకతో అతడు వెనుకబడ్డాడు. అదీగాక వయసు కూడా సాహా  కెరీర్ కు అడ్డుపడింది.  దీంతో అతడిని  టీమ్ మేనేజ్మెంట్ పక్కనబెట్టింది.  సాహా చివరిసారిగా  భారత జట్టు తరఫున 2021లో న్యూజిలాండ్ తరఫున ఆడాడు. మరి ఫ్యాన్స్ డిమాండ్‌ను  బీసీసీఐ పెద్దలు కరుణిస్తారో లేదో చూడాలంటే మరికొద్దిరోజులు వేచి ఉండాల్సిందే. 


గుజరాత్ టైటాన్స్ తరఫున గత సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడిన సాహా 317 పరుగులు  చేశాడు. ఈ సీజన్ లో  11 మ్యాచ్ లలో  273 పరుగులు చేశాడు. గత సీజన్ తో పోలిస్తే కాస్త నిలకడ లోపించినా  గుజరాత్ కు మెరుపు ఆరంభాలివ్వడంతో సాహా సక్సెస్ అవుతున్నాడు