Kohli Test Records: టీమిండియా మాజీ సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ భారీ రికార్డుల మీద కన్నేశాడు. బుధవారం (జూన్ 7) నుంచి కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో గనక కోహ్లీ రాణిస్తే సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, రికీ పాంటింగ్, మహేంద్ర సింగ్ ధోనిల రికార్డులు బ్రేక్ అవుతాయి.
మూడేండ్ల పాటు చెత్త ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కుని గతేడాది ఆగస్టు నుంచి మునపటి ఆటను అందుకున్న కోహ్లీ.. ఈ ఏడాది మంచి టచ్‌లోనే ఉన్నాడు. వన్డేలు, టెస్టులలో సెంచరీలతో పాటు ఇటీవల ముగిసిన ఐపీఎల్-16 లో కూడా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో జోరుమీదున్నాడు. 34 ఏండ్ల కోహ్లీ.. రేపటి టెస్టులో ఈ రికార్డుల మీద కన్నేశాడు.
ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో..
ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ పేరిట రికార్డు ఉంది. సచిన్.. 15 నాకౌట్ మ్యాచ్‌లలో 657 పరుగులు చేశాడు. కోహ్లీ ఆ రికార్డును బ్రేక్ చేయడానికి 37 పరుగులు దూరంలో ఉన్నాడు. విరాట్ ఖాతాలో 15 మ్యాచ్‌లలో 620 రన్స్ ఉన్నాయి. ఈ జాబితాలో పాంటింగ్.. 18 ఇన్నింగ్స్‌లలో 731 పరుగులు సాధించాడు. మరో 132 పరుగులు చేస్తే పాంటింగ్ రికార్డు బ్రేక్ అవుతుంది.
ఆసీస్‌పై రెండు రికార్డులు..
విరాట్ ఫేవరేట్ అపోజిషన్ అయిన ఆస్ట్రేలియాపై అతడు ఇంతవరకు 24 టెస్టులు ఆడి 1,979 పరుగులు సాధించాడు మరో 21 పరుగులు చేస్తే ఆసీస్‌పై టెస్టులలో 2 వేల పరుగులు పూర్తవుతాయి. ప్రస్తుత టీమిండియా టీమ్‌లో పుజారా మాత్రమే ఆసీస్‌పై 2 వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ జాబితాలో సచిన్ (3,630) ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అంతేగాక కోహ్లీ.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో 55 పరుగులు (ప్రస్తుతం 4,945) చేస్తే మూడు ఫార్మాట్లలో కలిపి ఆసీస్‌పై 5 వేల పరుగులు పూర్తి చేసినవాడవుతాడు. భారత్ తరఫున సచిన్‌కు మాత్రమే ఈ ఘనత (రెండు ఫార్మాట్లలో కలిపి 6,707 పరుగులు) ఉంది.
సచిన్, ద్రావిడ్ రికార్డులకు ఎసరు..
టీమిండియా తరఫున ఇంగ్లాండ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్.. 2,645 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా.. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ 2,626 రన్స్ సాధించాడు. కోహ్లీ 2,574 రన్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో 74 పరుగులు సాధిస్తే సచిన్, ద్రావిడ్‌లను అధిగమించే అవకాశముంది.
ధోని రికార్డు బ్రేక్..!
భారత్ తరఫున అత్యధికంగా ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా కోహ్లీ ఘనత అందుకోబోతున్నాడు. రేపటి మ్యాచ్ కోహ్లీకి 16వ ఐసీసీ నాకౌట్ గేమ్. అంతకుముందు ఈ రికార్డు సచిన్, ధోనిల పేరిట ఉండేది. ప్రపంచ క్రికెట్‌లో అత్యధికంగా రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 18 ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లు ఆడాడు.