WTC Final 2023: టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ఛేదనను ఛేదించే దిశగా సాగుతున్న టీమిండియాకు ఆస్ట్రేలియా షాకిచ్చింది. లక్ష్యం భారీగానే ఉన్నా కాన్ఫిడెంట్‌గా ఆడుతున్న ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ల జోడీని విడదీయడానికి ఆస్ట్రేలియా ఎప్పటిలాగే కుయుక్తులు పన్నిందా..? అంటే అవుననే అంటున్నారు టీమిండియా అభిమానులు. గిల్ క్యాచ్ అవుట్ వివాదంతో వాళ్లు ఇప్పుడు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు.
ఏం జరిగింది..?
444 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ఆరంభించింది. కెప్టెన్ రోహిత్ తో పాటు గిల్ కూడా ధాటిగానే ఆడేందుకు యత్నించాడు. ఇద్దరూ కలిసి 7 ఓవర్లకే 40 పరుగులు చేశారు. ఈ క్రమంలో 8వ ఓవర్ వేసిన స్కాట్ బొలాండ్ బౌలింగ్‌లో మొదటి బంతి.. గిల్ బ్యాట్‌కు తాకి స్లిప్స్ దిశగా వెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కామెరూన్ గ్రీన్ పక్కకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు.
అయితే క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి నేలకు తాకింది. దీంతో అనుమానంగానే గిల్‌తో పాటు ఆన్ ఫీల్డ్ అంపైర్లు కూడా థర్డ్ అంపైర్‌కు రివ్యూ చేశారు. టీవీ రిప్లేలో బంతికి నేలకు తాకడం స్పష్టంగా కనిపించింది. వివిధ యాంగిల్స్ నుంచి పరిశీలించిన థర్డ్ అంపైర్ మాత్రం.. దానిని ఔట్‌గా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి ముంచెత్తింది.
ఓవల్‌లో మ్యాచ్ చూస్తున్న టీమిండియా ఫ్యాన్స్‌కు ఇది ఆగ్రహం కలిగించింది. దీంతో స్టేడియంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ.. ‘చీటర్స్.. చీటర్స్’ అంటూ నినాదాలు చేశారు. ఇక గిల్ వివాదాస్పద ఔట్ తర్వాత ట్విటర్‌లో థర్డ్ అంపైర్ పై భారత క్రికెట్ అభిమానంలో ఆవేశం కట్టలు తెంచుకుంది. టీమిండియా ఫ్యాన్స్ చేసే సోషల్ మీడియా దాడికి దెబ్బకు ట్విటర్‌లో #Cheaters ట్రెండింగ్ అయింది.
గిల్ ఔట్ కాదని టీవీ రిప్లైలో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించడంపై అభిమానులు, ఓవల్ లో ప్రేక్షకులే కాదు మాజీ క్రికెటర్లు, డబ్ట్యూటీసీ ఫైనల్ లో కామెంట్రీ చెబుతున్న వాళ్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి కామెంట్రీ బాక్స్ నుంచే.. ‘గిల్ ప్లేస్ లో స్టీవ్ స్మిత్ ఉండి గనక థర్డ్ అంపైర్ దీనిని నాటౌట్ ఇచ్చేవాడు..’అని అన్నాడు. ఆసీస్ మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ కూడా..‘గ్రీన్ క్యాచ్ అందుకునేప్పుడు బంతి నేలను తాకడం క్లీయర్‌గా కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ దీనిని ఔట్ ఇవ్వడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది’ అని కామెంట్ చేశాడు.
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ విషయమై స్పందిస్తూ.. కళ్లకు గంతలు కట్టుకున్న ఓ వ్యక్తి ఫోటోను షేర్ చేస్తూ.. ‘గిల్ ఔట్ ప్రకటించేప్పుడు థర్డ్ అంపైర్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక నెటిజన్లను థర్డ్ అంపైర్ ను టార్గెట్ చేస్తూ చేస్తున్న మీమ్స్, ట్రోల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు క్రిస్ గఫని (న్యూజిలాండ్), రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లాండ్) ఆన్ ఫీల్డ్ అంపైర్లు కాగా టీవీ అంపైర్ గా ఇంగ్లాండ్‌కే చెందిన రిచర్డ్ కెటిల్‌బర్గ్ బాధ్యతల్లో ఉన్నాడు. శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన ఫోర్త్ అంపైర్ గా వ్యవహరిస్తున్నాడు.