WTC 2025 Final Prize Money: 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రైజ్ మనీ రివీల్ అయింది. జూన్ 11-15 తేదీల మధ్య ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి WTC విజేత కోసం రికార్డు స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించింది ఐసీసీ. ఈసారి WTC కోసం కోట్ల రూపాయల ప్రైజ్ పూల్ ఉంచారు, ఇది గతసారి కంటే 125 శాతం ఎక్కువ.
విజేతకు భారీ ప్రైజ్ మనీ
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతకు దాదాపు 30 కోట్ల 8 లక్షల రూపాయల ప్రైజ్ మనీ లభించనుంది. అయితే ఫైనల్‌లో ఓడిపోయిన జట్టు లేదా రన్నర్‌కు దాదాపు 18.5 కోట్ల రూపాయలు లభిస్తాయి. గతంలో రన్నర్‌కు కేవలం 6.8 కోట్ల రూపాయలు మాత్రమే బహుమతిగా లభించేది.
టెస్ట్ క్రికెట్‌ను ప్రోత్సహించడానికి ICC ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైజ్ మనీని భారీగా పెంచేందుకు ప్రయత్నించింది. మూడో, నాలుగో స్థానం నుంచి చివరి స్థానం వరకు ఏ జట్టు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళదు. గత రెండు ఫైనల్స్ ఆడిన భారత జట్టు ఈసారి మూడో స్థానంలో నిలిచింది. మూడో స్థానం లభించినందుకు 12 కోట్ల రూపాయలు బహుమతిగా లభించనుంది.
మిగిలిన జట్లకు కూడా డబ్బు
ICC విన్నర్ రన్నర్‌కే కాకుండా ఇతర జట్లకు కూడా ప్రైజ్‌మనీ ప్రకటించింది. మూడో స్థానంలో ఉన్న టీం ఇండియాకు 12 కోట్లు , టేబుల్‌లో తొమ్మిదవ స్థానంలో ఉన్న పాకిస్తాన్‌కు దాదాపు 41 లక్షల రూపాయలు లభించనున్నాయి. అయితే 2021 ఫైనల్ విజేత , ఈసారి నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌కు దాదాపు 10.2 కోట్ల రూపాయలు లభిస్తాయి.
ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌కు 8.2 కోట్లు, ఆరో స్థానంలో ఉన్న శ్రీలంకకు 7.1 కోట్లు, ఏడవ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌కు 6.1 కోట్లు, ఎనిమిదవ స్థానంలో ఉన్న వెస్టిండీస్‌కు 5.1 కోట్ల రూపాయలు లభిస్తాయి. 2021 - 2023లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజేతకు దాదాపు 13.7 కోట్ల రూపాయల బహుమతి లభించింది.
టెస్ట్ ఛాంపియన్ షిప్ ఎప్పుడు మొదలైంది
టెస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో 2019లో ఐసీసీ కొత్త ఫార్మాట్ తీసుకొచ్చింది. అదే టెస్ట్ ఛాంపియన్ షిప్. ఈ టెస్టు ఛాంపియన్ షిప్ సైకిల్ జూన్ నుంచి ప్రారంభమవుతుంది. ఆప్పటి నుంచి వచ్చే రెండేళ్ల వరకు టెస్టు హోదా కలిగిన జట్లు ఆడిన టెస్టు మ్యాచ్‌లు ఆధారంగా, గెలిచిన మ్యాచ్‌లు ఆధారంగా పాయిట్లు కేటాయిస్తారు. ప్రస్తుతానికి టెస్టు హోదా కలిసిన జట్లు 9 మాత్రమే ఉన్నాయి. వీళ్లంతా ఒకరిపై ఒకరు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఒక్కో జట్టు ఆరు సిరీస్‌లు ఆడుతుంది. ఇందులో స్వదేశంలో మూడు ఆడితే విదేశాల్లో మూడు ఆడాలి. ఒక్కో సిరీస్‌లో రెండు నుంచి ఐదు టెస్టులు వరకు ఉండొచ్చు.
టెస్టులో గెలిస్తే 12 పాయింట్లు ఇస్తారు. డ్రా అయితే నాలుగుపాయింట్లు, టై అయితే ఆరు పాయింట్లు ఇస్తారు. ఇలా రెండేళ్లపాటు ఎక్కువ పాయింట్లు సాధించిన టాప్ టూ జట్లు ఫైనల్ ఆడతాయి. ఇప్పుడున్న సైకిల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టాప్‌లో ఉన్నందన ఆ రెండు జట్లు WTC ఫైనల్ ఆడతాయి.
ఇప్పటి వరకు మూడు WTC ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. 2019-21 మధ్య కాలంలో టాప్ టూ జట్లుగా భారత్ న్యూజిలాండ్ నిలిచాయి. ఆ ఫైనల్‌లో భారత్ ఓటమి పాలైంది. తర్వాత 2021-23 సైకిల్‌లో మరో ఫైనల్ 2023 జూన్‌లో జరిగింది. అప్పుడు కూడా భారత్ ఫైనల్‌కు వచ్చింది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఈసారి మాత్రం భారత్ ఫైనల్‌కు రాలేకపోయింది. మొదటి WTC ఫైనల్‌కు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తే రెండోసారి రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా టెస్టు ఫార్మాట్‌కు బైబై చెప్పేశారు.