WTC 2023 Final: మరో ఐదు రోజుల్లో  ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే  వరల్డ్  టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌పై  క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అయితే ఈ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగిస్తే పరిస్థితి ఏంటి..? ‘ఒకపక్క ఎండలు మండిపోతుంటే వర్షం ఏంట్రా అప్రాచ్ఛపు వెధవ..’ అని తిట్టుకోవద్దు.  ఏమో.. ఐపీఎల్ -16 ఫైనల్‌లో  మండు వేసవిలో అహ్మదాబాద్‌ను వాన ముంచెత్తుతుందని ఎవరైనా అనుకున్నారా..? అసలే ఇంగ్లాండ్‌లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం..!


అది మరువలేం..!


2021లో  భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కూడా ఇంగ్లాండ్ (సౌతంప్టన్) లోనే జరిగింది. జూన్ 18 - 23 వరకు జరిగిన ఈ మ్యాచ్‌కు కూడా పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఫలితం (భారత్ ఓడింది) రిజర్వ్ డే లో తేలింది.  ఇక తాజా ఫైనల్ కూడా జరుగబోయేది  జూన్ లోనే కావడం గమనార్హం.  ఓవల్ లో కూడా వరుణ దేవుడు షాకులిస్తే ఏంటి పరిస్థితి..? 


రిజర్వ్ డే ఉందా..?


జూన్ 7 నుంచి 11 మధ్య జరుగబోయే  ఈ టెస్టుకు రిజర్వ్ డే ఉంది. అంటే  ఈ ఐదు రోజులలో ఎప్పుడైనా వర్షం పడి ఆటకు అంతరాయం కలిగిస్తే   అప్పుడు ఆ  కోల్పోయిన సమయాన్ని మిగిలి రోజులలో కవర్ చేస్తారు. అప్పుడు కూడా  వీలుకాకుంటే  ఆరో రోజు (జూన్ 12)కూడా ఆడిస్తారు. ఒకవేళ ఆలోపే ఫలితం తేలితే  రిజర్వ్ డే అవసరం ఉండదు. అలా కాకుండా ఉదాహరణకు  ఆట  రెండో రోజో, మూడో రోజో వర్షం కారణంగా మొత్తం  మూడు సెషన్లు జరుగకుంటే అప్పుడు   అంపైర్లు  ఆ సమయాన్ని మిగిలిన రోజుల్లో కవర్ చేస్తూ రిజర్వ్ డే రోజున సాధ్యమైనంత సేపు  మ్యాచ్ నిర్వహణకు ప్రయత్నిస్తారు.   


 






డ్రా అయితే..? 


వర్షం  లేకుండా  మ్యాచ్ ఐదు రోజుల్లో పలితం తేలకుండా డ్రా అయితే అప్పుడు రిజర్వ్ డేన ఆడించరు.   మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం కలిగించకుండా ఐదో రోజు కూడా ఫలితం తేలకుంటే రిజర్వ్ డే రోజున ఆడించరు.   టెస్టు డ్రా అయితే అప్పుడు ఇరు జట్లనూ సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. 


టై అయితే..? 


ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్స్ టై అయితే  కూడా రిజర్వ్ డే ఉండదు.  రెండు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు. 


ప్రైజ్ మనీ వివరాలు..  


డబ్ల్యూటీసీ ఫైనల్స్ గెలిచిన జట్టుకు భారీగా ప్రైజ్ మనీ దక్కనుంది. మొత్తంగా  ఈ  మెగా టోర్నీకి గాను ఐసీసీ 3.8 మిలియన్ డాలర్లను 9 జట్లకు పంచనుంది.  డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచిన జట్టుకు  1.6 మిలియన్ డాలర్స్ (సుమారు రూ. 13.32 కోట్లు), రన్నరప్‌కు 800,000 డాలర్లు  (రూ. 6.5 కోట్లు) దక్కుతాయి.   ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న  సౌతాఫ్రికాకు రూ. 3.5 కోట్లు, నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ కు రూ. 2.8 కోట్లు, ఫిఫ్త్  ప్లేస్ లో ఉన్న శ్రీలంకకు  రూ. 1.6 కోట్లు దక్కుతాయి. న్యూజిలాండ్, పాకిస్తాన్,  వెస్టిండీస్, బంగ్లాదేశ్ లకు  తలా  రూ. 82 లక్షల ప్రైజ్ మనీ  అందనుంది.