World Test Championship Final: భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఓవల్‌లో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భాగంగా తుది జట్టు నుంచి ఐసీసీ వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తప్పించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నలుగురు పేసర్లు ఓ స్పిన్నర్ల ఫార్ములాతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని మాజీ క్రికెటర్లు వాపోతున్నారు. ఇటీవలి కాలంలో పెద్దగా రాణించని ఉమేశ్ యాదవ్‌ను తీసుకుని అశ్విన్‌ను తప్పించడం ఏంటో అర్థం కావడం లేదని వాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదే విషయమై టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ నిన్నటి ఆటలో లంచ్ తర్వాత మాట్లాడుతూ.. ‘ఒక కెప్టెన్‌గా మీరు (రోహిత్‌ను ఉద్దేశిస్తూ) టాస్ కంటే ముందే తుది జట్టుపై నిర్ణయం తీసుకోవాలి. ఇండియా కూడా ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో ఆడాలని భావించింది. గత కొన్నాళ్లుగా విదేశీ పిచ్ లపై ఇదే ఫార్ములాతో ఆడుతున్న భారత్ ఇక్కడ కూడా అదే వర్కవుట్ అవుతుందని అనుకోవచ్చు. కానీ నన్ను అడిగితే మాత్రం నేనైతే నాలుగో పేసర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేసుకుంటా. అశ్విన్ లాంటి స్పిన్నర్‌ను తుది జట్టు నుంచి తప్పించడం చాలా కష్టం. అయితే కెప్టెన్‌గా ఎవరి ఆలోచనలు వారివి. దాని ప్రకారమే వాళ్లు నిర్ణయం తీసుకుంటారు’ అని చెప్పాడు.
టీమిండియా ఆలోచన ఏంటో అర్థం కాలేదు : గవాస్కర్
అశ్విన్‌ను తుది జట్టు నుంచి తప్పించడంపై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘అశ్విన్‌ను పక్కనబెట్టి టీమిండియా ఒక ట్రిక్‌ను కోల్పోయింది. అతడు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ బౌలర్. అతడిలాంటి ఆటగాడిని తీసుకునేప్పుడు పిచ్ గురించి ఆలోచించకూడదు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతూ వరల్డ్ నెంబర్ వన్ బౌలర్‌ను ఎందుకు పక్కనబెట్టడమేంటే అర్థం కాలేదు. అసలు ఉమేశ్ యాదవ్ గత కొన్నాళ్లుగా రాణించింది లేదు. టీమ్ లోనే లేని రిథమ్ కోల్పోయిన ఓ పేసర్ కోసం అశ్విన్‌ను పక్కనబెట్టడం కరెక్ట్ కాదు..’అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆసీస్ మాజీలు సైతం..
అశ్విన్‌ను తప్పించడంపై ఆసీస్ మాజీలు మాథ్యూ హెడెన్, రికీ పాంటింగ్‌లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హెడెన్ స్పందిస్తూ.. ‘టీమిండియా సింపుల్ ట్రిక్స్ మిస్ అయింది. ఇక్కడ టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకోవడం వింతగా ఉంది. రెండోది.. అశ్విన్ ను పక్కనబెట్టడం. డబ్ల్యూటీసీ సైకిల్ లో అతడు కీలక ప్లేయర్. అతడిని తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది...’అని అన్నాడు. రికీ పాంటింగ్ స్పందిస్తూ.. ‘డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరుగుతున్న ఓవల్ పిచ్ నెమ్మదిగా స్పిన్ కు సహకరిస్తుందని అంచనాలున్నాయి. అదీగాక ఆస్ట్రేలియాలో నలుగురు లెఫ్ట్ హ్యాండర్లున్నారు. వారని కట్టడిచేయడంలో అశ్విన్ కీలకంగా వ్యవహరించేవాడు. నా అభిప్రాయం ప్రకారమైతే.. టీమిండియా చేసిన అతి పెద్ద తప్పు ఇది..’ అని తెలిపాడు.
ఇక తొలి రోజు ఆటలో ఆసీస్‌దే ఆధిపత్యం. ఫస్ట్ సెషన్ లో కాస్త మెరుగ్గా బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు.. తర్వాత తేలిపోయారు. ట్రావిస్ హెడ్ (146 నాటౌట్) వన్డే తరహా ఆటకు స్టీవ్ స్మిత్ (95 నాటౌట్) క్లాస్ జతకలవడంతో ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసేసమయానికి 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. షమీ, సిరాజ్, శార్దూల్‌లు తలా ఓ వికెట్ తీశారు. అశ్విన్‌ను తప్పించి తుది జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ తొలిరోజు ప్రభావం చూపలేదు.