WTC Final 2023: టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్, ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్‌ల ట్విటర్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. చాలాకాలంగా ఈ ఇద్దరూ ట్విటర్‌లో చేసుకునే  చర్చలు ఆసక్తికరంగా సాగుతాయి.  ఒకరి మీద మరొకరు కౌంటర్లు వేసుకుంటూ ఆ ట్వీట్ల ద్వారానే అభిమానులకు అన్‌లిమిటెడ్ ఫన్‌ను పంచుతారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత చాలాకాలంగా  ఈ ఇద్దరూ పెద్దగా ట్విటర్ వార్ చేసుకున్న  సందర్భాలు రాలేదు. కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మరోసారి వీళ్ల గిల్లికజ్జాలకు వేదికైంది. 


డబ్ల్యూటీసీ పైనల్‌లో భాగంగా  తొలి రోజు ఆసీసీ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సెంచరీ చేయడంతో  వీళ్ల మధ్య  వార్ మొదలైంది. 76 పరుగులకే 3 వికెట్లు  కోల్పోయిన ఆసీస్‌ను  ట్రావిస్ హెడ్ ఆదుకుని  సెంచరీ చేశాడు.  శతకం తర్వాత వసీం జాఫర్ తన ట్విటర్ లో ‘డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఫస్ట్ టెస్ట్ సెంచరీ. వెల్ ప్లేయ్డ్ ట్రావిస్ హెడ్’ అని  అతడి ఫోటో పెట్టి ట్వీట్ చేశాడు.  కొద్దిసేపటికే ఇదే ట్వీట్‌ను  మైఖేల్ వాన్ రీట్వీట్ చేస్తూ.. ‘ఆఫ్టర్‌నూన్ వసీం’ అని గిల్లడం స్టార్ట్ చేశాడు. 


 






వాన్ చేసిన ట్వీట్‌కు వసీం కూడా స్పందిస్తూ.. ‘ఈవినింగ్ మైఖేల్! ఇది నిజంగా నువ్వేనా..? బ్లూటిక్ లేదు మరి’అని కౌంటర్ ఇచ్చాడు. ఇటీవలే  ట్విటర్ సీఈవో అధికారిక ఖాతాలకు బ్లూటిక్ కోసం  కొంత రుసుము  చెల్లించాలని  కొత్త రూల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.  అయితే జాఫర్ అడిగిన ఈ ప్రశ్నకు వాన్ వీడియో రూపంలో క్లారిటీ ఇచ్చాడు. ‘నాకు బ్లూ టిక్ అవసరం లేదు వసీం’ అంటూ వీడియో థమ్సప్  సింబల్ చూపిస్తూ వీడియో షేర్ చేశాడు.  వీళ్లిద్దరి ట్వీట్స్ ప్రస్తుతం  నెట్టింట వైరల్ గా మారాయి. 


 






ఇండియా  బాగా ఆడని  సందర్భంలో వాన్.. వసీంను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తాడు. గతంలో ఇవి చాలా జరిగాయి. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వీళ్ల ట్విటర్ వార్ ఎక్కడిదాకా వెళ్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈ ఇద్దరూ ఎంత  విమర్శించుకున్నా..  వీళ్ల మధ్య ట్వీట్స్  కూడా చాలా హుందాగా ఉండి అందర్నీ నవ్విస్తాయి. 


 






ఇక డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భాగంగా తొలి రోజు ఆట విషయానికొస్తే.. ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (146 బ్యాటింగ్: 156 బంతుల్లో, 22 ఫోర్లు, ఒక సిక్సర్), స్టీవెన్ స్మిత్ (95 బ్యాటింగ్: 227 బంతుల్లో, 14 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. వీరు నాలుగో వికెట్‌కు అభేద్యంగా 251 పరుగులు జోడించారు. రెండో రోజు ప్రారంభంలో వీరి వికెట్ తీయకపోతే టీమిండియాకు పరిస్థితులు మరింత క్లిష్టం అవుతాయి.