Harmanpreet heroics help Mumbai win: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్(Gijarat Jaints)పై ముంబై(Mumbai) విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసంతో విజయం సాధించిన ముంబై ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఓటమి ఖాయమనుకున్న దశలో హర్మన్ ప్రీత్ విధ్వంసంతో ముంబై అదిరిపోయే విజయం సాధించింది. చివరి ఆరు ఓవర్లలో దాదాపు ఓవర్‌కు 14 పరుగులు చేయాల్సిన దశలో హర్మన్... గుజరాత్ బౌలర్లను ఊచకోత కోసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 48 బంతుల్లోనే 10 ఫోర్లు, అయిదు సిక్సర్లతో 95 పరుగులతో అజేయంగా నిలిచి ముంబైకి చిరస్మరణీయ విజయం సాధించింది. 36 బంతుల్లో 91 పరుగులు చేయాల్సిన స్థితిలో ఒత్తిడిలో పడింది. ఈ దశలో హర్మన్‌ప్రీత్ అసాధారణంగా పోరాడింది. అమేలియా (12 నాటౌట్)తో కలిసి మెరుపు భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది.
మ్యాచ్ సాగిందిలా..
మహిళల ప్రిమియర్ లీగ్ సీజన్-2లో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించి ప్లేఆఫ్స్ చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది. హేమలత (74), కెప్టెన్ బెత్ మూనీ (66) అర్ధ శతకాలు చేశారు. ఛేదనలో ముంబై 19.5 ఓవర్లలో 191/3 స్కోరు చేసి నెగ్గింది. యాస్తిక (49) రాణించింది. హర్మన్, కెర్ (12 నాటౌట్) నాలుగో వికెట్‌కు అజేయంగా 93 రన్స్ జోడించి.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్మన్ క్యాచ్‌ను లిచ్‌ఫీల్డ్ చేజా ర్చడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. గెలుపునకు చివరి 18 బంతుల్లో 47 పరుగులు కావాల్సి ఉండగా.. రాణా వేసిన 18వ ఓవర్‌లో హర్మన్ 24 రన్స్ రాబట్టడంతో సమీకరణం ఒక్కసారిగా మారిపోయింది. 19వ ఓవర్లో పది పరుగులే రావడంతో ఆఖరి ఓవర్లో గెలవాలంటే 13 పరుగులు అవసరమయ్యాయి. తొలి రెండు బంతులను సిక్స్, ఫోర్‌గా మలిచిన హర్మన్ విజయాన్ని ఖాయం చేసింది. ఈ గెలుపుతో ముంబై ప్లేఆఫ్స్‌కు చేరింది.
‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్’ ప్రకటన
వన్డేలు, టీ20ల రాకతో టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతుంది. కొందరు ఆటగాళ్లు లీగ్‌లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. టెస్టు క్రికెట్ ఆడే ఆకలి లేని క్రికెటర్లను టీంలోకి తీసుకోవద్దంటూ రోహిత్ శర్మ(Rohit Sharma) ఇటీవల వ్యాఖ్యానించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలకు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) కూడా మద్దతు తెలిపాడు. రోహిత్ శర్మ వ్యాఖ్యలు పూర్తి నిజమని.. టెస్టు క్రికెట్ ఆడాలనుకునే వారినే ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీకి సూచించాడు. ఈ సూచనలతో బీసీసీఐ మరిన్ని చర్యలు తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ... సెంట్రల్ కాంట్రాక్టులో ఉండి టెస్టులు ఆడే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులను పెంచడంతో పాటు బోనస్ కూడా ప్రకటించింది.