WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభ సీజన్ మొదలయ్యే తేదీ ఖరారైంది. మార్చి 4 న డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 26న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మేరకు బీసీసీఐ 5 డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీలకు ఈ- మెయిల్ పంపినట్లు సమాచారం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు ముంబైలోని బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాలలో జరగనున్నాయి.
ఫిబ్రవరి 13న ఆటగాళ్ల వేలం
ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 13న ముంబయిలో జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హేమంగ్ అమిన్ ధృవీకరించారు. ఫిబ్రవరి 13న వేలం జరగనుంది. మొత్తం 1500 క్రీడాకారిణులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఈ వారంలో ఆటగాళ్ల తుది జాబితాను విడుదల చేస్తాం. వేలంలో గరిష్టంగా 90 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఒక్కో ఫ్రాంచైజీ 15 నుంచి 18 మంది ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. అని అమిన్ తెలిపారు.
2 స్టేడియాలలో మ్యాచ్ లు
ఫిబ్రవరి 26న దక్షిణాఫ్రికాలో మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. అది ముగిసిన 8 రోజుల తర్వాత అంటే మార్చి 4 న డబ్ల్యాపీఎల్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు వచ్చే క్రీడాకారిణుల ప్రయాసను తగ్గించడానికి బీసీసీఐ మొదటి సీజన్ ను ముంబయికి పరిమితం చేయాలని నిర్ణయించింది. అందుకే ముంబయిలోని 2 స్టేడియాలలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంను బ్యాకప్ గా ఎంపికచేశారు.
బీసీసీఐకు భారీగా ఆదాయం
ఇప్పటికే డబ్ల్యూపీఎల్ మీడియా హక్కులు, ఫ్రాంచైజీ యాజమాన్య హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. దీంతో బీసీసీఐకు భారీగా ఆదాయం సమకూరింది. మీడియా హక్కులను వయోకామ్ 18 5 ఏళ్ల కాలానికి రూ. 951 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే 5 ఫ్రాంచైజీలను విక్రయించడం ద్వారా మొత్తం రూ. 4666. 99 కోట్లు బీసీసీఐకు సమకూరాయి.
డబ్ల్యూపీఎల్- 2023 ఫార్మాట్
- ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరగనున్నట్లు సమాచారం.
- ఇందులో పాల్గొనే 5 జట్లు ఒకదానితో ఒకటి లీగ్ మ్యాచుల్లో 5 సార్లు తలపడతాయి. మొత్తం 20 లీగ్ మ్యాచ్ లు ఉంటాయి.
- పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.
- 2, 3 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో విజయం సాధించిన జట్టు రెండో ఫైనలిస్ట్ గా ఉంటుంది.