DC W vs UPW W: 


విమెన్‌ ప్రీమియర్‌ లీగులో ఐదో మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్‌, యూపీ వారియర్జ్‌ తలపడుతోంది. టాస్‌ గెలిచిన యూపీ కెప్టెన్‌ అలీసా హేలీ ఫీల్డింగ్‌ ఎంచుకొంది. పిచ్‌ పచ్చికతో కళకళలాడుతోందని ఆమె తెలిపింది. చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నామని, గ్రేస్‌ హ్యారిస్‌ స్థానంలో ఇస్మాయిల్‌ను ఎంచుకున్నామని పేర్కొంది. ఈ నిర్ణయం అత్యంత ప్రభావం చూపిస్తుందని వెల్లడించింది. స్థానిక, విదేశీ క్రికెటర్లతో తమ జట్టు సమతూకంగా ఉందంది. పటిష్ఠమైన దిల్లీ మ్యాచులో తమకు సవాళ్లు ఎదురవుతాయని అంచనా వేసింది.




సారథుల పోరాటం


ఆస్ట్రేలియాకు నాలుగు టీ20 ప్రపంచకప్‌లు అందించిన సారథి మెగ్‌లానింగ్‌ (Meg Lanning). ఆమెకు అన్నింట్లో అండగా నిలిచింది అలీసా హీలీ (Alyssa Healy). నేడు ఈ ఇద్దరూ వేర్వేరు జట్ల తరఫున నేడు డీవై పాటిల్‌ స్టేడియంలో (Dy Patil Stadium) పోటీపడనున్నారు. ఆర్సీబీ మ్యాచులో రాధా యాదవ్‌ కాస్త ఎక్కువ పరుగులే ఇచ్చింది. ఆమె స్థానంలో డీసీ బహుశా పూనమ్‌ యాదవ్‌ను ప్రయత్నించొచ్చు. టీ20 ప్రపంచకప్‌ నుంచి విరామం లేకుండా ఆడుతున్న మారిజానె కాప్‌కు విశ్రాంతి ఇవ్వొచ్చు. ఆమె స్థానంలో లారా హ్యారిస్‌, టిటాస్‌ సాధుకు అవకాశం దొరుకుతుంది. గుజరాత్‌ జెయింట్స్‌పై విజయం సాధించినప్పటికీ యూపీ వారియర్జ్‌ మిడిలార్డర్‌ ఘోరంగా విఫలమైంది. గ్రేస్‌ హ్యారిస్‌, సోఫీ ఎకిల్‌స్టోన్‌ కలిసి ఆఖరి మూడు ఓవర్లలో 53 పరుగులు చేయకుంటే ఓటమి పాలయ్యేది. ఈ విభాగంలో వారు మెరుగవ్వాల్సి ఉంది.


వీళ్లు  కీలకం


మొదటి మ్యాచులో బ్రబౌర్న్‌ మైదానంలో డీసీ బ్యాటర్‌ షెఫాలీ వర్మ (Shafali Verma) విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు డీవై పాటిల్‌లోనూ అదే దూకుడు కొనసాగించొచ్చు. హోమ్‌ గర్ల్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues) సైతం సాలిడ్‌గా కనిపిస్తోంది. తొలి మ్యాచులో హాఫ్‌ సెంచరీ చేసిన కిరన్‌ నవగిరెపై (Kiran Navgire) యూపీ ఆశలు పెట్టుకుంది. ఒకప్పుడు జాతీయ జట్టులో అవకాశాలను దుర్వినియోగం చేసుకున్న ఆమెకు డబ్ల్యూపీఎల్‌ (WPL 2023) ఓ మంచి వేదిక. గ్రేస్‌ హ్యారిస్‌ నుంచి ఆమెకు బ్యాకప్‌ ఉంది. రాజేశ్వరీ గైక్వాడ్‌ కాస్త నిరాశపరిచింది. యువ స్పిన్నర్‌ పర్వేశి చోప్రా ఎదురు చూస్తున్న తరుణంలో ఆమె మెరుగ్గా ఆడటం ముఖ్యం.


తుది జట్లు


దిల్లీ క్యాపిటల్స్‌: మెగ్‌ లానింగ్‌, షెఫాలీ వర్మ, మారిజానె కాప్‌, జెమీమా రోడ్రిగ్స్‌, అలిస్ క్యాప్సీ, జెస్‌ జొనాసెన్‌, తానియా భాటియా, అరుంధతీ రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్‌, టారా నోరిస్‌


యూపీ వారియర్జ్‌ : అలిసా హీలీ, శ్వేతా షెరావత్‌, కిరన్‌ నవగిరె, తాహిలా మెక్‌గ్రాత్‌, దీప్తి శర్మ, షబ్నమ్‌ ఇస్మాయిల్‌, సిమ్రన్‌ షైక్‌, దేవికా వైద్య, సోఫీ ఎకిల్‌స్టోన్‌, అంజలీ శర్వాణి, రాజేశ్వరీ గైక్వాడ్‌