ICC player of Month Nominees:


అంతర్జాతీయ క్రికెట్లో ఫిబ్రవరి నెలకుగాను అత్యుత్తమ క్రికెటర్లను ఐసీసీ నామినేట్‌ చేసింది. పురుషులు, మహిళల విభాగాల్లో తలో ముగ్గురిని ఎంపిక చేసింది. ఐసీసీ ఇండిపెండెంట్‌ కమిటీ, అభిమానులు తమ ఓటింగ్‌ ద్వారా విజేతలను నిర్ణయించాల్సి ఉంటుంది.


మహిళల క్రికెట్లో ఒక టాప్‌ క్లాస్‌ బ్యాటర్‌, ఇద్దరు ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్లను నామినేట్‌ చేశారు. గతేడాది డిసెంబర్లోనే ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ యాష్లే గార్డ్‌నర్‌ ఈ అవార్డును సొంతం చేసుకుంది. అప్పట్నుంచీ జోరు కొనసాగిస్తూనే ఉంది. ఈ మధ్యే ముగిసిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో దుమ్మురేపింది. ఆసీస్‌ ఆరో ప్రపంచకప్‌ గెలిచేందుకు కీలకంగా ఆడి మరోసారి నామినేట్‌ అయింది.


ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ నాట్‌ సివర్‌ బ్రంట్‌ సైతం అవార్డుకు నామినేట్‌ కావడం గమనార్హం. ఈ మధ్యే ఆమె ఐసీసీ విమెన్‌ క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు పొందింది. ఇంగ్లాండ్‌ను సెమీస్‌కు తీసుకెళ్లింది. తన బ్యాటింగ్‌ మెరుపులతో దక్షిణాఫ్రికాను ఫైనల్‌కు తీసుకెళ్లిన లారా వోల్వ్‌వార్త్‌ సైతం నామినేట్‌ అయింది. పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌లో ఆమే టాప్‌ స్కోరర్‌ కావడం గమనార్హం.


Also Read: బ్యాటుపై MSD 07 రాసుకుంది.. గుజరాత్‌పై హాఫ్ సెంచరీ బాదేసింది!


అరంగేట్రం నుంచీ ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న హ్యారీ బ్రూక్‌ పురుషుల క్రికెట్లో నామినేట్‌ అయ్యాడు. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీసులో పరుగుల వరద పారించాడు. రెండు టెస్టుల్లోనే 329 పరుగులు చేశాడు. వెల్లింగ్టన్‌ టెస్టులో 24 బౌండరీలు, ఐదు సిక్సర్లతో 186 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడేశాడు. ఆస్ట్రేలియా టెస్టు సిరీసులో దుమ్మురేపిన టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అతడికి గట్టి పోటీనిస్తున్నాడు. సిరీసులో భారత్‌ను 2-0తో ముందుకు తీసుకెళ్లాడు. ఫిబ్రవరిలో 17 వికెట్లు పడగొట్టాడు. దిల్లీ టెస్టులో 42 పరుగులే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. బ్యాటుతోనూ రాణించాడు. తొలి టెస్టులో 70 పరుగులు చేశాడు.


వెస్టిండీస్‌ క్రికెటర్‌ గుడాకేశ్‌ మోటీ సైతం ఫిబ్రవరి నెలలో నామినేట్‌ అయ్యాడు. తన లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌తో జింబాబ్వేపై 1-0 తేడాతో సిరీస్‌ అందించాడు. రెండు టెస్టుల్లో కలిసి 19 వికెట్లు పడగొట్టాడు. బులవాయోలో జరిగిన రెండో టెస్టులోనైతే 13-99తో అదరగొట్టాడు. నామినేషన్లను చూస్తుంటే పోటీ గట్టిగానే కనిపిస్తోంది.