ముంబై: నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య మహిళల ప్రపంచ కప్ ఫైనల్ జరగనుంది. లీగ్ దశలో ఇరు జట్లు తలపడినప్పుడు, మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. కానీ చివరకు దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుని తొలిసారిగా ప్రపంచకప్ గెలవాలని భారత్ భావిస్తోంది. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నవీ ముంబై వాతావరణం ఎలా ఉంటుందో వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
నవీ ముంబై వాతావరణం ఎలా ఉంటుంది?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 2న జరిగే ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ప్రభావితం కావచ్చు. మ్యాచ్‌లో వర్షం చాలాసార్లు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ సమయంలో ఆకాశంలో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో వర్షం వచ్చే అవకాశం ఉంది. AccuWeather ప్రకారం సాయంత్రం 4- 7 గంటల మధ్య 50 శాతం కంటే ఎక్కువ సమయం వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చు.
పగటివేళ తేమ స్థాయి చాలా ఎక్కువగా ఉండవచ్చు. రెండవ ఇన్నింగ్స్‌లో మంచు చాలా పెద్ద విషయంగా మారవచ్చు. అలాంటి పరిస్థితిలో టాస్ చాలా కీలకంగా మారనుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంటుంది.
ఫైనల్‌లో ఎన్ని పరుగులు చేస్తారు?
నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుత ప్రపంచ కప్ 2025లో ఈ మైదానంలో మొత్తం 4 మ్యాచ్‌లు జరిగాయి. మొదట శ్రీలంక బంగ్లాదేశ్‌పై 203 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుంది. ఆ తర్వాత భారత జట్టు న్యూజిలాండ్‌ను 53 పరుగుల తేడాతో ఓడించింది. భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా ఇదే మైదానంలో జరిగింది, అయితే వర్షం కారణంగా రిజల్ట్ తేలలేదు.
భారత్-ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ కూడా ఇదే మైదానంలో జరిగింది. ఇందులో ఇండియా 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో సాధించిన అత్యంత విజయవంతమైన పరుగుల ఛేజింగ్‌గా ఈ మ్యాచ్ నిలిచింది. సెమీఫైనల్లో స్కోరింగ్, టార్గెట్ చేజింగ్ చెక్ చేస్తే.. ఫైనల్‌లో కూడా హై-స్కోరింగ్ మ్యాచ్ చూడటం ఆశ్చర్యం కలిగించదు. కానీ పిచ్ బౌలర్లకు సమస్యగా మారే అవకాశం ఉంది. ఆరంభంలోనే వికెట్లు తీయకపోతే ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను కట్టడి చేయడం అంత తేలిక కాదు.
భారత్, దక్షిణాఫ్రికా జట్లు 34 మ్యాచులలో తలపడగా 20 మ్యాచ్‌లలో టీమిండియా నెగ్గింది. 13 మ్యాచులలో దక్షిణాఫ్రికా విజయం సాధించగా.. ఒక మ్యాచ్ డ్రా అయింది. ఈ వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజీలో ఓటమికి భారత్ ప్రతీకారంతీర్చుకోవాలని భావిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికాలలో ఎవరు గెలిచినా వన్డే వరల్డ్ కప్ చరిత్రలో కొత్త ఛాంపియన్ అవతరిస్తుంది.