మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు భారత్, దక్షిణాఫ్రికా మధ్య మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, నవీ ముంబైలో భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహణకు అంతరాయం కలుగుతోంది. మంచి ఫైనల్ మ్యాచ్ చూడాలనుకున్న అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే వర్షం వల్ల, ఇతర కారణాలతో మ్యాచ్ జరగకపోతే ఏమవుతుంది, రిజల్ట్ ఏంటని ఆందోళన చెందుతున్నారు? ఇద్దరినీ విజేతలుగా ప్రకటిస్తారా లేదా ఇంకెం చేస్తారు.. ICC రూల్స్ ఇక్కడ తెలియజేస్తున్నాం.
భారత మహిళా క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు మధ్య వన్డే వరల్డ్ కప్ ఫైనల్ నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది, టాస్ 2:30 గంటలకు వేయాలి. కానీ ఇక్కడ ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. మ్యాచ్‌కు ముందు కూడా జల్లులు కురిశాయి. నాలుగున్నర గంటలకు టాస్ వేయాలని డిసైడ్ చేశారు.
ప్రపంచ కప్ ఫైనల్ జరగకపోతే ఏమవుతుంది?
మహిళల వన్డే ప్రపంచ కప్ కోసం రిజర్వ్ డే ఉంటుంది. అంటే ఈరోజు మ్యాచ్ పూర్తి కాకపోతే, అది రిజర్వ్ డేలో ఆడతారు. సోమవారం, నవంబర్ 3 దీని రిజర్వ్ డేగా నిర్ణయించారు. ఈరోజు మ్యాచ్ జరగకపోతే లేదా కొద్దిగా జరిగితే, రేపు మిగతా మ్యాచ్ అక్కడి నుంచే కొనసాగిస్తారు. ఈరోజు మ్యాచ్ అసలు ఆడకపోతే, రేపు పూర్తి మ్యాచ్ నిర్వహిస్తారు. అప్పుడు సమయంతో పాటు ఓవర్లలో కోత విధించవచ్చు.
సోమవారం నవీ ముంబైలో వర్షం కురిసే అవకాశం
రిజర్వ్ డే రోజున కూడా నవీ ముంబైలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు నగరంలో రోజంతా వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్పుడు రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ జరగకపోతే విజేత జట్టును ఎలా నిర్ణయిస్తారని ఆసక్తి నెలకొంది.
రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ జరగకపోతే విజేత ఎవరు
రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ జరగకపోతే భారత్, దక్షిణాఫ్రికా జట్లను ఉమ్మడిగా విజేతలుగా ప్రకటిస్తారు. అంటే భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మహిళల జట్టు ట్రోఫీని పంచుకుంటాయి. కొత్త ఛాంపియన్ కానున్న జట్లు ఒకేసారి సంయుక్త విజేతలుగా కానున్నాయి.