Womens Asia Cup Final: మహిళల ఆసియాకప్‌ టీ20 ఫైనల్లో టీమ్‌ఇండియా దుమ్మురేపింది. ప్రత్యర్థి శ్రీలంకను అల్లాడించింది. రేణుకా సింగ్‌ (3/5), రాజేశ్వరీ గైక్వాడ్‌ (2/16), స్నేహ్‌ రాణా (2/13) బంతితో చుక్కలు చూపించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంకేయులను 65/9 పరుగులకే పరిమితం చేశారు. ఇనోకా రణవీర (18*; 22 బంతుల్లో 2x4), ఓషది రణసింఘె (13; 20 బంతుల్లో 1x4) టాప్‌ స్కోరర్లు. వీరు మినహా ఆ జట్టులో ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు.




టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు వరుస షాకులు తగిలాయి. టీమ్‌ఇండియా అద్భుత బౌలింగ్‌కు తోడు సొంత తప్పిదాలు వారి కొంప ముంచాయి. స్పిన్‌కు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై బ్యాటింగ్‌ ఎంచుకోవడం మొదటి తప్పు! బాగా ఆడే ఓపెనర్లు చమరీ ఆటపట్టు (6), అనుష్క సంజీవని (2) సమన్వయ లోపంతో రనౌట్‌ అయ్యారు. మూడో ఓవర్లో జట్టు స్కోరు 8 వద్ద ఆటపట్టు వెనుదిరిగింది. ఆ తర్వాత రేణుకా సింగ్‌ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడ్డాయి. మూడో బంతికి హర్షిత (0) క్యాచ్‌ ఔట్‌ అయింది. నాలుగో బంతికి సంజీవని రనౌట్‌. ఐదో బంతికి హాసిని పెరీరా పెవిలియన్‌ చేరింది. వీరంతా 9 వద్దే ఔటవ్వడం గమనార్హం. ఆ తర్వాత రాజేశ్వరీ, స్నేహ్‌ రాణా బౌలింగ్‌లో రెచ్చిపోవడంతో లంక ఎక్కడా కోలుకోలేదు. చివరికి 65/9తో నిలిచింది.