Where is Kohli : ఇప్పుడు క్రికెట్‌ ప్రపంచం అంతటినీ వేధిస్తున్న ఒకే ప్రశ్న విరాట్‌ కోహ్లీ(Virat Kohli) ఎక్కడ. కోహ్లీ 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకూ ఒక్కసారి కూడా స్వదేశంలో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు దూరం కాలేదు. కానీ తొలిసారి ఇంగ్లాండ్‌(England)తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. ఇదే ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. నిరాంటకంగా.. విజయవంతంగా సాగుతున్న కోహ్లీ ప్రయాణంలో అనుకోకుండా విరామం వచ్చింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌కు పూర్తిగా దూరంగా ఉన్న కోహ్లీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు. టీ 20 ప్రపంచకప్‌ వరకు అయినా అందుబాటులోకి వస్తాడా... ఐపీఎల్‌లో బెంగళూరు తరపున బరిలోకి దిగుతాడా అన్న ప్రశ్నలు వేధిస్తున్నాయి. 

 

ఏమిటా వ్యక్తిగత కారణాలు..?

వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. అంతకుముందు కూడా ఇదే కారణంతో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడలేదు. కానీ టెస్టుల్లో బరిలో దిగాడు. ఇక స్వదేశంలో కీలకమైన ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌లో కోహ్లీ కచ్చితంగా ఆడతాడనే అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే తొలి టెస్టు కోసం అతను హైదరాబాద్‌కు కూడా వచ్చాడు. కానీ ఉన్నట్లుండి మ్యాచ్‌ ఆరంభానికి ముందే ఇక్కడినుంచి వెళ్లిపోయాడు. తొలి రెండు టెస్టులకు అతను అందుబాటులో లేడని బీసీసీఐ ప్రకటించింది. మూడో టెస్టు నుంచి అయినా అతను ఆడతాడేమోనని అనుకుంటే.. ఇప్పుడు వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. 

 

విరాట్‌ సోదరుడు ఏమన్నాడంటే..?

మా అమ్మ ఆరోగ్యం గురించి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయని తాను గమనించానని... మా అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని విరాట్‌ కోహ్లీ సోదరుడు వికాస్‌ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేశారు. . సరైన సమాచారం లేకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని అభిమానులను, మీడియాను అభ్యర్థించాడు. 

 

ఏబీడీ ఏమన్నాడంటే...

విరుష్క జోడీ రెండో బిడ్డను స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నారని ఇటీవల దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ఇటీవల వ్యాఖ్యానించాడు. కుటుంబం కోసం టెస్టులకు దూరమైనట్లు పేర్కొన్నాడు. తీరా, ఇప్పుడు ఏబీడీ ఇప్పుడు మాట మార్చాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పడంతో అభిమానుల్లో అయోమయం మొదలైంది. తాను గత వీడియోలో పెద్ద పొరపాటు చేశానని తనకు అందిన సమాచారమంతా తప్పేనని అంగీకరించాడు. విరాట్‌ అనుష్క జోడి రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కుండబద్దలు కొట్టాడు. దీనిపై విరాట్ కుటుంబమే స్పష్టత ఇస్తుందని కూడా చెప్పాడు. అక్కడ ఏం జరుగుతుందనేది తెలియదని... విరాట్‌ త్వరగా జట్టులోకి రావాలని కోరుకుంటున్నానని అన్నాడు. విరామం తీసుకోవడానికి కారణమేదైనా కోహ్లీ మరింత బలంగా తిరిగి రావాలని ఎదురు చూస్తున్నానని ఏబీడీ తెలిపాడు. 

 

స్పష్టంగా కనిపిస్తున్న లోటు

జట్టులో కోహ్లీ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. అతను మైదానంలో ఉంటే ఉండే ఉత్సాహమే వేరు.  టెస్టు క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే, ఈ ఫార్మాట్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చే విరాట్‌ ఇప్పుడీ సిరీస్‌లో లేకపోవడం ప్రపంచ క్రికెట్‌కు దెబ్బ అని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాసర్‌ హుస్సేన్‌ కూడా వ్యాఖ్యానించాడు. అండర్సన్, కోహ్లీ మధ్య పోరును చూసే ఛాన్స్‌ మిస్సయ్యామని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, ఆకాశ్‌ చోప్రా తెలిపాడు. ఇక ఆటపరంగా చూసినా భారత టెస్టు జట్టులో కోహ్లీ లేని లోటు తెలుస్తోంది.