Rohit Sharma Retirement: రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. రోహిత్ ఇప్పటికే టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించేశాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు ముందు రోహిత్ ఈ ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరించింది. రోహిత్ శర్మ తర్వాత భారత టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ కాగల ఆటగాళ్లు ఎవరు అనే చర్చ మొదలైంది. గత సిరీస్‌ల ఓటమి తర్వాత టెస్టుల విషయంలో బారత్‌పై చాలా ఒత్తిడి ఉంది. అందుకే ఈ బాధ్యతలు చేపట్టే వాళ్లు ఆ ఒత్తిడిని తట్టుకొని జట్టును నడిపించాల్సి ఉంటుంది. 

1. జస్ప్రీత్ బుమ్రారోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత, టెస్ట్ జట్టుకు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉన్న ఆటగాళ్లలో మొదటి స్థానంలో ఉన్నది జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ ఉన్నాడు. అతను 3 టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కూడా చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తన నాయకత్వంతో అందరినీ ఆకట్టుకున్నాడు. అందుకే బుమ్రా కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. 2024-25లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో అతను భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్‌లో భారతదేశం 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 

2. శుభ్‌మన్‌గిల్‌  టీమ్ ఇండియా 'ప్రిన్స్' అని కూడా పిలుచుకునే శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. చాలా తక్కువ సమయంలోనే భారత వన్డే జట్టులో వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. టీ20 ఫార్మాట్‌లో టీమ్ ఇండియా కెప్టెన్‌గా గిల్ చేశాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం, తదుపరి ప్రపంచ ఛాంపియన్‌షిప్ సైకిల్‌కు సెలెక్టర్లకు కొత్త, యువ కెప్టెన్‌పై దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది. ఆ కోణంలో చూసుకుంటే రాబోయే కొంతకాలంలో గిల్‌ను కొత్త కెప్టెన్‌గా సిద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయని అంటున్నారు.  

3. రిషబ్ పంత్/శ్రేయస్ అయ్యర్2025-26 సీజన్ కోసం శ్రేయస్ అయ్యర్ BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోకి తిరిగి వచ్చాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా తరపున అయ్యర్ అత్యధిక పరుగులు(243) సాధించాడు. అయ్యర్ IPLలో కూడా చాలా కెప్టెన్సీ అనుభవాన్ని సంపాదించాడు. రిషబ్ పంత్ కూడా కెప్టెన్సీ రేసులో ఉంటాడు. అతని దూకుడు భారత టెస్ట్ జట్టుకు విజయవంతమైన కెప్టెన్‌గా మారడానికి సహాయపడుతుంది.

రోహిత్ శర్మ ఎప్పుడు టెస్టుల్లో అడుగు పెట్టాడు- కెప్టెన్ ఎప్పుడు అయ్యాడు?

రోహిత్ శర్మ 2013 నవబర్ 6న టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. విండీస్‌తో ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లోనే దుమ్ముదులిపాడు. 177 పరుగులు సాధించాడు.  2022లో టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ నుంచి టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవరిస్తున్నాడు. టెస్టు ప్లేయర్‌గా, టెస్టు జట్టు కెప్టెన్‌గా చాలా రికార్డులు రోహిత్ శర్మ పేరిట ఉన్నాయి. స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా ఉన్న ఏ సిరీస్‌ను కూడా రోహిత్ శర్మ ఓడిపోలేదు.