న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచాడు. మైదానంలో దూకుడు ఆటతీరుతో ఆకట్టుకున్న 'గబ్బర్' వ్యక్తిగత జీవితంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో తన ప్రేయసిసి పెళ్లి చేసుకోబోతున్నాడు. శిఖర్ ధావన్ డేటింగ్ చేస్తున్న ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో కలిసి ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నాడు. వీరిద్దరూ చాలా కాలంగా  డేటింగ్‌లో ఉన్నారని తెలిసిందే. ఇప్పుడు తమ రిలేషన్ ను వివాహ బంధంగా మలచాలని వీరు నిర్ణయించుకున్నారు. 

Continues below advertisement

దుబాయ్ నుంచి మొదలైన చర్చ

2025లో దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా శిఖర్ ధావన్, సోఫీ షైన్‌లు తొలిసారి జంటగా కనిపించారు. అప్పట్లో వీరిద్దరూ తమ బంధాన్ని బహిరంగపరచలేదు. కానీ స్టేడియంలో వారిని చూసిన వారికి విషయం అర్థమైంది. ఆ తర్వాత కొన్ని నెలలకు, మే 2025లో ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో కలిసి ఫోటో షేర్ చేసి తమ రిలేషన్‌షిప్ ను అధికారికంగా ధృవీకరించారు.

Continues below advertisement

సోఫీ షైన్ ఎవరు?

సోఫీ షైన్ ఐర్లాండ్‌కు చెందిన యువతి. ఆమె వృత్తిరీత్యా ప్రొడక్ట్ కన్సల్టెంట్ గా చేస్తున్నారు. ఆమె లిమెరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె అబుదాబిలోని ఒక పెద్ద ఆర్థిక సేవల సంస్థ అయిన నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో సెకండ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తోంది.

ధావన్ ఫౌండేషన్‌తో కూడా అనుబంధం

 ప్రస్తుతం శిఖర్ ధావన్ ఫౌండేషన్‌తో కూడా సోఫీ షైన్ అనుబంధం కలిగి ఉంది. అందులో ఆమె కీలక సభ్యురాలుగా మారారు. ఈ ఫౌండేషన్ ధావన్ స్పోర్ట్స్ గ్రూప్ 'Da One Sports'తో అనుబంధం ఉన్న ఒక సామాజిక సంస్థ. ఇది స్పోర్ట్స్, సామాజిక సేవ రంగాలలో పనిచేస్తుంది. ఐపీఎల్ 2024 సమయంలో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నప్పుడు శిఖర్ ధావన్‌తో పాటు సోఫీ కనిపించింది. కానీ అప్పుడు ఎవరికీ ఈ విషయం అంతగా తెలియలేదు. 

ఫిబ్రవరిలో పెళ్లి

మీడియా నివేదికల ప్రకారం, శిఖర్ ధావన్, సోఫీ షైన్‌ల వివాహం ఫిబ్రవరి మూడవ వారంలో జరగనుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భారత క్రికెటర్ ధావన్ వివాహ వేడుక జరుగుతుంది. ఇది ఒక ప్రైవేట్ వేడుకగా కొందరు సన్నిహితుల సమక్షంలో నిర్వహించనున్నారు. ఇందులో కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు మాత్రమే వేడుకలో పాల్గొంటారు.

మొదటి వివాహం, విడాకులు

శిఖర్ ధావన్‌కు గతంలోనే వివాహం జరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని ధావన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో పరిచయం, ఆపై ప్రేమగా మారింది. మనసులు కలిశాయని 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. అనంతరం అభిప్రాయ భేదాలు, భార్య తనను టార్చర్ చేస్తుందని శిఖర్ ధావన్ కోర్టు ఆశ్రయించడంతో విడాకులు మంజూరు చేసింది. పరస్పర విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. కానీ ధావన్ మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అక్టోబర్ 2023లో విడాకులు తీసుకున్నాక ధావన్ ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. తన కుమారుడ్ని మాత్రం చాలా మిస్ అవుతున్నాడు.