Ind Vs Wi 2nd Test Test Latest Updates: వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు ఫుల్ డామినేషన్ చూపిస్తోంది. శనివారం మూడోరోజు 140-4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్.. 81.5 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. వన్ డౌన్ బ్యాటర్ ఆలిక్ అతనాజ్ (41) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కు ఐదు వికెట్లు దక్కాయి. దీంతో భారత్ కు 270 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ ను భారత్ 5 వికెట్లకు 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (175) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
కుల్దీప్ జోరు..ఓవర్ నైట్ స్కోరు తో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన వెస్ట్ ఇండిస్ ను కుల్దీప్ వణికించాడు. ఓవర్ నైట్ బ్యాటర్ షాయ్ హోప్ (36)ను కుల్దీప్ బౌల్డ్ చేసి వికెట్ల పతనానికి తెరదించాడు. దీంతో ఐదో వికెట్ కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ తెవిన్ ఇమ్లాచ్ (21)ను ఎల్బీగా పెవిలియన్ కు పంపించాడు. ఆ తర్వాత జస్టిన్ గ్రీవ్స్ (17)ను కుల్దీప్ ఔట్ చేయగా, జోమెల్ వర్రీకన్ (1)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. దీంతో 175 పరుగులకే విండీస్ 8 వికెట్లు కోల్పోయింది. ఫిలిప్ పోరాటం..ఈ దశలో పియర్ (23), ఫిలిప్ (24 నాటౌట్) అద్భుతమైన పోరాటం చేశారు. వీరిద్దరూ ఆతిథ్య బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. మధ్యలో ఒకసారి అంపైర్ ఔట్ ఇచ్చిన రివ్యూలో నాటౌట్ గా తేలింది. ఆ తర్వాత చకచకా పరుగులు చేస్తూ, తొమ్మిదో వికెట్ కు 46 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే చాలా సేపు విసిగించిన ఈ జోడీని స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా విడదీశాడు. చక్కని బంతితో పియర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఫిలిప్-జైడెన్ సీల్స్ (13) జంట కూడా పోరాట పటిమ ప్రదర్శించింది. పదో వికెట్ కు కీలకమైన 25 పరుగులు జోడించడంతో విండీస్ ఇన్నింగ్స్ 248 పరుగుల వద్ద తెరపడింది. దీంతో ఇండియాకు 270 పరుగుల భారీ ఆధిక్యం దక్కడంతో పాటు, ఫాలో ఆన్ ను ఎన్ ఫోర్స్ చేయడంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.