Virat Kohli - Saha: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ఆహారపు అలవాట్లు తనకు ఆశ్చర్యం కలిగించేవని విరాట్ కోహ్లీ అంటున్నాడు. విచిత్రమైన కాంబినేషన్లతో ఆహారం తినేవాడని గుర్తు చేసుకున్నాడు. ఈ మధ్య ప్యారిస్‌కు వెళ్లినప్పుడు శాకహారం దొరక్క ఇబ్బంది పడ్డానని వెల్లడించాడు. 'వన్ 8 కమ్యూన్' అనే యూట్యూబ్ ఛానళ్లో అతడు మాట్లాడాడు.
భారత క్రికెట్ జట్టులో ఫిట్‌నెస్ అంటే గుర్తొచ్చే ఆటగాడు విరాట్ కోహ్లీ. పటిష్ఠమైన దేహ దారుఢ్యం కోసం అతనెంతో కష్టపడతాడు. జిమ్‌లో గంటలు గంటలు కసరత్తు చేస్తాడు. ఆహారాన్ని కొలిచినట్టుగా తింటాడు. కొవ్వు పెంచే ఫుడ్‌ను అస్సలు ముట్టుకోడు. టీమ్‌ఇండియాలో కొన్నేళ్లుగా ఎంతో మంది క్రికెటర్లతో కలిసి ఆహారం పంచుకున్నాడు. విచిత్రమైన ఆహారపు అలవాట్లు ఉన్న క్రికెటర్ పేరు చెప్పాలని కోరడంతో వృద్ధిమాన్ పేరును విరాట్ సూచించాడు.
'విచిత్రమైన కాంబినేషన్లలో ఆహారం తీసుకొనేవాళ్లంటే వృద్ధిమాన్ సాహా అని చెప్పొచ్చు. ఒకసారి అతడి ప్లేటులో బటర్ చికెన్, రోటి, సలాడ్, రసగుల్లా ఉండటం చూశాను. అతడు ఒకట్రెండు రోటీ ముక్కలు, సలాడ్ తిన్నాక పూర్తి రసగుల్లాను మింగేయడం చూశాను. ఆశ్చర్యం వేసి వృద్ధి! ఏం చేస్తున్నావని అడిగాను. సాధారణంగా తాను తినే పద్ధతి ఇలాగే ఉంటుందన్నాడు. దాల్ చావల్‌తో ఐస్‌క్రీమ్ తినడమూ చూశాను. రెండు ముద్దలు అన్నం తిని ఐస్‌క్రీమ్ తినేవాడు' అని కోహ్లీ చెప్పాడు.
తన వరస్ట్ ఫుడ్ ఎక్స్‌పీరియెన్స్ ఏంటో కోహ్లీ వివరించాడు. 'నాకు ఎదురైన ఘోర అనుభవం గురించి చెబుతాను. ఈ మధ్యే నేను ప్యారిస్ వెళ్లాను. అక్కడ ఘోరం! శాకహారులకైతే పీడకలే అనొచ్చు. భాషా పరమైన అడ్డంకులకు తోడు తినేందుకు తక్కువ ఆప్షన్లు ఉంటాయి' అని విరాట్ చెప్పాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా బయల్దేరి వెళ్లింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, రాహుల్ ద్రవిడ్ ఉత్సాహంగా కనిపించారు.