Chetan Sharma Breaks Silence On ODI Captaincy Sacking Controversy: విరాట్‌ కోహ్లీ (Virat Kohli)గురించి తాను చెడుగా మాట్లాడానని గతంలో జరిగిన ప్రచారాన్ని మాజీ సెలక్టర్‌ చేతన్‌ శర్మ( Chetan Sharma)  ఖండించాడు. కోహ్లీని తన సొంత కుమారుడిలా భావిస్తానని తెలిపాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో కింగ్‌ కోహ్లీ జట్టులోకి రావాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చేతన్‌ శర్మ తెలిపాడు. గతేడాది ఓ స్టింగ్‌ ఆపరేషన్‌లో విరాట్‌ కోహ్లీ, సౌరవ్‌ గంగూలీ, రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యాతో పాటు జట్టులోని ఇతర ఆటగాళ్లపై చేతన్‌ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దానిపై దుమారం రేగడంతో సెలక్టర్‌ పదవికి రాజీనామా చేశాడు. దానిపై తాజాగా చేతన్‌ శర్మ స్పందించాడు. విరాట్‌ గురించి తానెందుకు చెడుగా మాట్లాడతానని చేతన్ ప్రశ్నించాడు. కోహ్లీ త్వరగా జట్టులోకి తిరిగి వచ్చి 100 సెంచరీలు పూర్తి చేయాలని ఆశిస్తున్నానని అన్నాడు. ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ను సైతం చేతన్‌ శర్మ ప్రశంసించాడు. జట్టు కోసం తనను తాను త్యాగం చేసే కొద్దిమంది ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ ఉంటాడని పొగడ్తలు కురిపించాడు. 



వ్యక్తిగత కారణాలేనా..?
వ్యక్తిగత కారణాల చేత ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు ఇప్పటికే దూరమైన కోహ్లీ... తర్వాత జరుగబోయే మిగతా మూడు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండడన్న వార్తలు అభిమానులను ఆందోళన పరుస్తున్నాయి. చివరి మూడు టెస్ట్‌లకు ఇవాళ టీమిండియాను ప్రకటించాల్సి ఉన్నా విరాట్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కోహ్లి తల్లి సరోజ్‌ కోహ్లి తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు, ఆమెను దగ్గరుండి చూసుకునేందుకే కోహ్లి మిగతా టెస్ట్‌లకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ నిజంగానే కోహ్లి ఇంగ్లండ్‌తో తదుపరి సిరీస్‌కు దూరమైతే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగలినట్లే.


టాప్‌టెన్‌లో కోహ్లీ ఒక్కడే...
బ్యాటింగ్‌ విభాగం ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి విరాట్ కోహ్లీ( (Virat Kohli) ఒక్కడే టాప్‌-10లో( (Indian In Top 10 Batters) నిలిచాడు. కోహ్లీ ఒక స్థానం మెరుగై 767 పాయింట్లతో ఆరో స్థానం దక్కించుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో కివీస్‌ దిగ్గజ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌.. నెంబర్‌ వన్‌ స్థానాన్ని నిలుపుకున్నాడు. కేన్‌ మామ తర్వాత ఇంగ్లండ్‌కే చెందిన జో రూట్‌, ఆసీస్‌ వెటరన్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌లు రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. కివీస్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ డారెల్‌ మిచెల్‌ నాలుగో స్థానంలో ఉండగా పాకిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ ఐదు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరాడు. భారత్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులు చేసిన ఓలీపోప్‌ ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌ టెస్టుకు ముందు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 35వ స్థానంలో ఉన్న పోప్‌.. 20 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. పోప్‌కు కెరీర్‌లో ఇదే బెస్ట్‌ ర్యాంకు కావడం గమనార్హం. టాప్‌ -10లో కోహ్లీ మినహా మరెవరూ భారత బ్యాటర్లు లేరు. టీమిండియా సారథి రోహిత్‌ శర్మ 12వ ర్యాంకులో ఉండగా రిషభ్‌ పంత్‌ 13వ స్థానంలో ఉన్నాడు. టెస్టు ఆల్‌ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 425 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా 328 పాయింట్లతో రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. అక్షర్‌ పటేల్‌ ఆరో స్థానంలో నిలిచాడు. టెస్ట్‌ టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా, భారత్‌లు తలా 117 పాయింట్లతో సమానంగా ఉన్నా ఆసీస్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. భారత్‌ రెండో స్థానంలో ఉంది. 115 పాయింట్లతో ఇంగ్లండ్‌ మూడో స్థానంలో ఉంది. వన్డే, టీ20లలో మాత్రం భారత్‌దే అగ్రస్థానం.