Ind vs sa 1st odi | రాంచీ: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురువారం నాడు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇంటికి వెళ్లాడు. కోహ్లీ ప్రస్తుతం టీమిండియాతో పాటు రాంచీలో ఉన్నాడు. ఇక్కడ దక్షిణాఫ్రికాతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డే ఆడాల్సి ఉంది. కోహ్లీ వచ్చాడని తెలిసి అతడ్ని చూడటానికి ధోనీ ఇంటి బయట పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Continues below advertisement

వైరల్ అవుతున్న వీడియోలో విరాట్ కోహ్లీ కారు రాంచీలోని ధోనీ ఇంటి లోపలికి వెళుతున్నట్లు మీరు గమనించవచ్చు. కోహ్లీ కారు ముందు, వెనుక పోలీసు కార్లు ఉన్నాయి. ధోనీ ఇంటి వద్ద కోహ్లీని చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. కోహ్లీని చూసిన అభిమానులు తమ ఫోన్లకు పని చెప్పారు. కోహ్లీని ఫోటోలు, వీడియోలు తీశారు.

విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ వీడియోలు కూడా వైరల్

రాంచీలో గురువారం నాడు రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోలో కోహ్లీ మంచి టచ్‌లో కనిపించాడు. కోహ్లీ భారీ షాట్లు ఆడుతున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ కూడా వన్డే సిరీస్‌ కోసం బాగానే ప్రాక్టీస్ చేశాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన గత సిరీస్‌లో రోహిత్ శర్మ బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. కోహ్లీ ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది. ఆస్ట్రేలియాలో 3 మ్యాచ్‌లలో 2 మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు. అయితే మూడో వన్డేలో మాత్రం కోహ్లీ అర్ధ శతకంతో టచ్ లోకి వచ్చాడు. 

JSCA స్టేడియంలో భారత్ vs దక్షిణాఫ్రికా మొదటి వన్డే

నవంబర్ 30న జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ vs దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి వన్డే జరగనుంది. టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన తర్వాత, వన్డే సిరీస్‌లో మెరుగ్గా రాణించాలని ఇండియాపై ఒత్తిడి పెరిగింది. దాంతో రోహిత్ శర్మ, కోహ్లీలపై అదనపు బారం పడుతుందని క్రికెట్ విశ్లేషకులు, మాజీలు చెబుతున్నారు.