Hanuma Vihari vows not to play for Andhra again:  భవిష్యత్తులో ఆంధ్ర క్రికెట్‌ జట్టు(Andhra Cricket Team) తరఫున ఆడబోనని టీమిండియా బ్యాటర్ హనుమ విహారి(Hanuma Vihari) తెలిపాడు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనని సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌(Instgram)లో పోస్టు చేశారు. మధ్యప్రదేశ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌లో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయిన అనంతరం క్రికెటర్ విహారి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ACA) ఒక రాజకీయ నాయకుడి కుమారుడి కోసం తనను కెప్టెన్సీ నుంచి తప్పించినా జట్టు పట్ల, ఆటపై ప్రేమతో ఇన్నాళ్లు ఆటను కొనసాగించానని పేర్కొన్నాడు. ఇకపై ఆంధ్ర తరఫున ఆడబోనని స్పష్టం చేశాడు.

రంజీ మ్యాచ్‌లో భాగంగా బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 17వ ఆటగాడిపై అరిచానని చెప్పాడు. ఆ ఆటగాడు రాజకీయ నాయకుడైన తన తండ్రికి చెప్పడంతో ఆయన తనపైన చర్యలు తీసుకోవాలని ACAపై ఒత్తిడి తీసుకొచ్చారని వెల్లడించాడు. తన వైపున తప్పు లేకపోయినా కెప్టెన్‌ నుంచి తప్పించారని పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా సదరు ఆటగాడిని తాను ఏమి అనలేదని వివరించాడు. గతేడాది మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కుడి చేతికి గాయమైనా జట్టు కోసం ఎడమ చేతితోనే బ్యాటింగ్‌ చేశానని గుర్తు చేశాడు. జట్టు కోసం అంత చేసినా తనను కాదని ఆ ఆటగాడే ముఖ్యమని ACA భావిస్తోందని ఆరోపించాడు. భారత్‌ తరఫున 16 టెస్టులు ఆడిన హనుమ విహారి కెప్టెన్‌గా గత ఏడేళ్లలో ఆంధ్ర జట్టును ఐదు సార్లు నాకౌట్‌కు చేర్చాడు.

 

ఆంధ్ర జట్టు తరఫున విహారి 30 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా.. ప్లేయర్‌గా కూడా సత్తాచాటాడు. 53 సగటుతో 2,262 పరుగులు స్కోర్ చేశాడు. అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆంధ్ర బ్యాటర్లలో విహారి కూడా ఒకడు. అయితే హైదరాబాద్ మూలాలున్న కారణంగా హనుమ విహారి కొన్ని విషయాల్లో ఆంధ్ర జట్టులో బయటి ఆటగాడిగా కనిపిస్తున్నాడని 'క్రిక్‌బజ్' అప్పట్లో  తెలిపింది. అయితే ఆంధ్ర క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ ఆర్‌వీసీహెచ్ ప్రసాద్ మాత్రం విహారి తనంతట తానుగా కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడని.. ఇందులో ఎలాంటి ఒత్తిడి లేదని వెల్లడించారు. "బ్యాటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించేందుకు విహారి కాస్త విరామం తీసుకోవాలనుకున్నాడు. అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. విహారిని తప్పించాలని ఎలాంటి ఒత్తిడి లేదు" అని ప్రసాద్ తెలిపారు. 

 


టీమిండియాలో ఇలా....

2018లో టీమిండియా టెస్టు జట్టులో అరంగేట్రం చేసిన విహారి... ఇప్పటివరకు 16 టెస్టు మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో భారత జట్టు ఓడిపోయే స్థితిలో విహారి వీరోచిత పోరాటం చేశాడు. 161 బంతులను ఎదుర్కొని మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తంగా 33.56 సగటుతో 839 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 111. చివరిసారిగా 2022లో ఇంగ్లాండ్‌పై టెస్టు మ్యాచ్ ఆడాడు. 

ఒక సెంచరీ, ఐదు హాఫ్‌ సెంచరీ బాదేశాడు. ఇక 114 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచుల్లో 53.02 సగటు, 48.54 స్ట్రైక్‌రేట్‌తో 8643 పరుగులు చేశాడు. 23 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అప్పుడప్పుడు ఆఫ్‌ స్పిన్‌ వేస్తాడు. టీమ్‌ఇండియా తరఫున 10 ఇన్నింగ్సుల్లో 5 వికెట్లు తీశాడు. ఫస్ట్‌ క్లాస్‌లో 27, లిస్ట్‌ ఏలో 22, టీ20ల్లో 26 వికెట్లు పడగొట్టాడు.