సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక క్రికెట్‌లో కీలక పరిణామం సంభవించింది. శ్రీలంక కొత్త సెలక్షన్ కమిటీని ఆ దేశ క్రీడా మంత్రి హరీన్ ఫెర్నాండో ప్రకటించారు. కొత్త కమిటీ నియామకం తక్షణమే అమలు వస్తోందని వెల్లడించారు. ఈ సెలక్షన్ కమిటీకి శ్రీలంక మాజీ వన్డే కెప్టెన్ ఉపుల్ తరంగ చైర్మెన్‌గా ఎంపికయ్యాడు. ఈ కమిటీలో ఉపుల్ తరంగతో పాటు మాజీ ఆటగాళ్లు అజంతా మెండిస్, ఇండికా డి సారమ్, తరంగ పరణవితన, దిల్రువాన్ పెరీరా సభ్యులుగా ఉన్నారు. ఉపుల్ తరంగ నేతృత్వంలోని ఈ సెలక్షన్ కమిటీ రెండేళ్ల పాటు శ్రీలంక జట్టును ఎంపిక చేయనుంది. జనవరిలో స్వదేశంలోజింబాబ్వేతో జరిగే సిరీస్‌కు జట్టు ఎంపికతో లంక కొత్త సెలక్షన్ కమిటీ ప్రయాణం ప్రారంభం కానుంది. ఉపుల్ తరంగా ఓపెనర్‌గా లంకకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. మూడు ఫార్మట్‌లలో 9వేలకు పైగా పరుగలు చేశాడు.
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ మండలి(International Cricket Council) ఐసీసీ(ICC) బోర్డు శుక్రవారం (నవంబరు 10) శ్రీలంక క్రికెట్ బోర్డు(sri lanka cricket board) సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఒక సభ్య దేశంగా శ్రీలంక క్రికెట్ బోర్డు తమ బాధ్యతలను ఉల్లంఘిస్తోందని ఐసీసీ బోర్డు (ICC )ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు తమ వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించడం సాధ్యం కాదని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డ్ శ్రీలంక క్రికెట్ ICC సభ్యత్వాన్ని తక్షణమే సస్పెండ్ చేసింది. శ్రీలంకలో క్రికెట్ అడ్మినిస్ట్రేషన్, కంట్రోలింగ్ అంతా ప్రభుత్వ జోక్యం ఉంది. సస్పెన్షన్ నిబంధనలను ఐసీసీ బోర్డు తగిన సమయంలో నిర్ణయిస్తుంది’’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రభుత్వం జోక్యం లేకుండా శ్రీలంకలో క్రికెట్ నిర్వహణ, క్రికెట్ నియంత్రణ బాధ్యతలను నిర్వర్తించడంలో క్రికెట్ బోర్డు విఫలమైందని ఐసీసీ ఆరోపించింది. ఇప్పటికే వరల్డ్ కప్(World Cup 2023) లో శ్రీలంక జట్టు నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే శ్రీలంక క్రికెట్ బోర్డును ఐసీసీ రద్దు చేసింది.
వరల్డ్‌కప్‌లో పేలవ ప్రదర్శన కారణంగా శ్రీలంక క్రికెట్ గవర్నింగ్ బాడీని రద్దు చేస్తూ శ్రీలంక పార్లమెంట్ గురువారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దీనికి అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా పూర్తి మద్దతు లభించింది. ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండింటిని మాత్రమే గెలవగలిగింది. దీంతో ఇది ఇప్పటివరకు వారి అత్యంత పేలవ ప్రదర్శన అని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే భారత్‌పై శ్రీలంక జట్టు 56 పరుగులకే ఆలౌట్ అయింది. సోమవారం అంతకుముందు, క్రీడా మంత్రి రోషన్ రణసింగ్ శ్రీలంక క్రికెట్ బాడీని తొలగించి, క్రికెట్ బోర్డును నడపడానికి ఏడుగురు సభ్యుల మధ్యంతర కమిటీకి మాజీ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ అర్జున రణతుంగను చీఫ్ గా నియమించారు. అయితే, కోర్టులో అప్పీల్ తర్వాత, షమ్మీ సిల్వా నేతృత్వంలోని శ్రీలంక క్రికెట్ బోర్డు మంగళవారం తిరిగి నియమించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం, ప్రతిపక్షాలు గురువారం పార్లమెంట్‌లో ఉమ్మడి తీర్మానాన్ని సమర్పించిన సంగతి తెలిసిందే.