WPL 2025 UPW Vs RCB Super Over Result Live Updates: డబ్ల్యూపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేజేతులా ఓడిపోయింది. టెయిలెండర్లను కట్టడి చేయలేక పరాజయం పాలైంది. ఆ తర్వాత నిర్వహించిన సూపర్ ఓవర్లో 9 రన్స్ కొట్టలేక తన బలహీనతను ప్రదర్శించింది. సోమవారం బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్లో యూపీ విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొమ్మిది పరుగుల టార్గెను నిర్దేశించగా.. 6 బంతులు ఆడిన ఆర్సీబీ కేవలం 4 పరుగులే చేసింది. . ఈ విజయంతో యూపీ పట్టికలో 3వ స్థానానికి వెళ్లింది. అంతకుముందు టాస్ ఓడిన బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ విధ్వంసక ఫిఫ్టీ (56 బంతుల్లో 90 నాటౌట్, 9 ఫోర్లు, 3 సిక్సర్లు)తో సత్తా చాటింది. అనంతరం ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన యూపీ సరిగ్గా 180 పరుగులకు ఆలౌటైంది. సోఫీ ఎకిల్ స్టోన్ (19 బంతుల్లో 33, 1 ఫోర్, 4 సిక్సర్లు) అద్భుతమైన పోరాటంతో మ్యాచ్ టై అయింది. దీంతో మ్యాచ్ సూపర్ వైపు వైపు దారి తీసింది. సూపర్ ఓవర్లో యూపీ తొలుత 8 పరుగులు చేయగా.. ఆర్సీబీ దాన్ని ఛేదించడంలో విఫలమైంది. ఆర్సీబీ బౌలర్లలో స్నేహ్ రాణా మూడు వికెట్లతో సత్తా చాటింది.
అద్భుత భాగస్వామ్యం.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి శుభారంభం దక్కలేదు. కెప్టెన్ స్మృతి మంధన (6) మరోసారి విఫలమైంది. ఈ దశలో మరో ఓపెనర్ డానీ వ్యాట్ హోడ్జ్ (57)తో కలిసి స్కోరును పెర్రీ ముందుకు నడిపించింది. గత మ్యాచ్ లో ఉన్న ఫామ్ ను కొనసాగిస్తూ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. వీరిద్దరూ యూపీ బౌలర్లను చితక్కొట్టారు. దీంతో 65 బంతుల్లోనే 94 పరుగులు జోడించారు. ఈ క్రమంలో చెరో 36 బంతుల్లో పెర్రీ, వ్యాట్ ఫిప్టీలను పూర్తి చేసుకున్నారు. అయితే కాసేపటికే వ్యాట్ ఔటవగా, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఒంటరి పోరాటం చేసిన పెర్రీ జట్టుకు భారీ స్కోరు అందించింది. బౌలర్లలో చినెల్ హెన్రీ, కెప్టెన్ దీప్తి శర్మ, తాహ్లియా మెక్ గ్రాత్ కు తలో వికెట్ దక్కింది.
ఎకిల్ స్టోన్ అసమాన పోరాటం..ఛేదనను ఓ మోస్తారుగా యూపీ ఆరంభించింది బ్యాటర్లు ఎవరూ తమకు దక్కిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. కిరణ్ నవగిరే (24), దీప్తి (25), శ్వేతా షరవాత్ (31) భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. దీంతో ఓ దశలో 134-8తో యూపీకి ఓటమి తప్పదనిపించింది. ఈ దశలో ఎకిల్ స్టోన్ విజృంభించింది. చివరి రెండు ఓవర్లలో 29 పరుగులు కావాల్సి ఉండగా, 19 వ ఓవర్లో 11 రన్స్ రాగా, 20వ ఓవర్లో రెండు సిక్స్ లు, ఒక ఫోర్ కొట్టిన ఎకిల్ స్టోన్ ఆర్సీబీని బెంబేలెత్తించింది. అయితే చివరి బంతికి ఒక్క పరుగు అవసరమైన దశలో ఎకిల్ స్టోన్ రనౌట్ అయింది. దీంతో మ్యాచ్ టోర్నీలోనే తొలి సూపర్ ఓవర్ కు దారి తీసింది. సూపర్ ఓవర్లో యూపీ తరపున హెన్రీ, గ్రేస్ హారీస్, ఎకిల్ స్టోన్ బరిలోకి దిగారు. దీంతో ఎనిమిది పరుగులను యూపీ సాధించింది. అయితే ఛేదనలో ఆర్సీబీ తరపున స్మృతి, రిచా ఘోష్ బరిలోకి దిగినా కేవలం నాలుగు పరుగులే చేయడంతో నాలుగు పరుగులతో ఆర్సీబీ ఓడిపోయింది. ఫస్ట్ బ్యాట్ తో మ్యాచ్ ను మలుపు తిప్పిన ఎకిల్ స్టోన్.. సూపర్ ఓవర్లో బాల్ తోనూ జట్టును గెలిపించింది. సోపీకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.