భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరుగుతున్న వేళ... పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన ప్రకటన తీవ్ర సంచలనం సృష్టించింది. హ్యాట్రిక్ ఓటములతో మహా సంగ్రామంలో బాబర్ సేన సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారిన పీసీబీ నుంచి ఈ ప్రకటన వెలువడింది. అసాధారణమైన.. అనూహ్యమైన ఈ ప్రకటన క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. వరుస ఓటములతో పాక్ జట్టుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్టు ఈ ప్రకటన విడుదల చేసింది... ఇంతకీ ఆ ప్రకటనలో ఏముందంటే.
అసలు ఆ ప్రకటనలో ఏముందంటే..?
క్లిష్ట సమయంలో పాకిస్థాన్ జట్టుకు మద్దతుగా నిలవాలని అభిమానులను కోరుతూనే... సారధి బాబర్ ఆజంకు ఓ హెచ్చరిక కూడా చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం, టీమ్ మేనేజ్‌మెంట్ పై తీవ్ర విమర్శల నేపథ్యంలో తాము ఈ ప్రకటన జారీ చేస్తున్నామని పీసీబీ వెల్లడించింది. ఆటలో గెలుపోటములు సహజమన్న మాజీ క్రికెటర్ల మాటలతో తాము ఏకీభవిస్తున్నామన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు... వరల్డ్ కప్ 2023 టీమ్ ఎంపికకు కెప్టెన్ బాబర్ ఆజం, చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్‌లకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని గుర్తు చేసింది. ప్రపంచకప్‌లో జట్టు ప్రదర్శన చూసిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ ప్రయోజనాలకు అనుగుణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి పాకిస్థాన్ జట్టుకు అందరూ అండగా నిలవాలని... బాబర్ సేన ఈ మెగా ఈవెంట్‌లో మళ్లీ గాడిన పడాలని ప్రయత్నిస్తోందని పీసీబీ ఆ ప్రకటనలో పేర్కొంది.
వరుస ఓటముల నేపథ్యంలో బాబర్ ఆజమ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని చాలా డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటినుంచి అన్ని మ్యాచ్‌లు గెలిచి పాకిస్థాన్ జట్టు కనీసం సెమీఫైనల్ చేరకపోతే బాబర్ ఆజం కెప్టెన్సీ పదవి ఊడిపోతున్నట్లుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటన ఉంది. ప్రపంచ కప్‌లో జట్టు ప్రదర్శన మెరుగుపడకపోతే బాబర్ నాయకత్వం ప్రమాదంలో పడుతుందని చెబుతున్నట్లుగా ప్రకటన ఉండడంపై బాబర్ అభిమానులు భగ్గుమంటున్నారు. ప్రపంచకప్ జరుగుతున్న వేళ... జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటన ఎందుకు విడుదల చేశారని పీసీబీని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ కప్ ముగిసిన తర్వాత జట్టు ప్రదర్శన ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు కదా అని పలువురు మాజీ క్రికెటర్లు కూడా నిలదీస్తున్నారు.
దక్షిణాఫ్రికాపై ఓడితే ఇంటికే..
ప్రపంచకప్‌లో చావో రేవో తేల్చుకునే మ్యాచ్‌కు పాకిస్థాన్ సిద్ధమైంది. చెన్నై చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకోనుంది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడి సర్వత్రా విమర్శలు కురుస్తున్న వేళ.. మహా సంగ్రామంలో ఉన్న చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాక్ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే పాక్ సెమీఫైనల్ అవకాశాలు పూర్తిగా గల్లంతవుతాయి. ఇప్పటికే పాక్ జట్టుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ.. ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైతే దాయాది జట్టు పరిస్థితి మరింత ఘోరంగా ఉండనుంది. నాకౌట్ చేరకుండా ప్రపంచకప్‌లో పాక్ పోరాటం ముగుస్తుంది. వరుస ఓటములతో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. ఎందుకంటే ఇప్పటినుంచి ప్రతీ మ్యాచ్ గెలిస్తేనే పాక్‌కు సెమీస్ అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో పాక్ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో అంచనా వేయలేమన్న నినాదం ఉంది. తమదైన రోజున ఎంత పటిష్టమైన జట్టునైనా పాక్ ఓడించగలుగుతుంది. కాబట్టి దాయాది జట్టు వరుసగా అన్ని మ్యాచ్‌లు గెలిచి సెమీస్ చేరే అవకాశం కూడా ఉంది.