ఆఫ్రికన్ దేశం ఉగాండాUganda) చరిత్ర సృష్టించింది.  కెన్యా(Kenya), జింబాబ్వే(Zimbabwe) వంటి జట్లను చిత్తుచేసిన  జట్టు వచ్చే ఏడాది అమెరికా(America), వెస్టిండీస్‌(West Indies) వేదికగా జరిగే టి20 వరల్డ్‌ కప్‌(T20 World Cup)కు తొలిసారిగా  అర్హత సాధించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం ..ఆఫ్రికా రీజియన్‌లో జరిగిన అర్హత పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో ఉగాండా పొట్టికప్పులోకి ఎంట్రీ సంపాదించింది. ఉగాండా చేసిన అద్భుత  ప్రదర్శనతో 2024 టీ20 ప్రపంచకప్‌నకు.. జింబాబ్వే దూరమైంది. 


నిజానికి ఉగాండా పేరు  క్రికెట్లో అసలు ఎప్పుడూ గొప్పగా వినిపించలేదు . 2019లో ఉగాండాకు ఐసీసీ టీ20 సభ్యత్వం ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం  81 మ్యాచ్‌లు ఆడిన ఉగాండా.. 61 మ్యాచ్‌లలో విజయం సాధించింది. కేవలం 17 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. అయినా సరే  పెద్ద టోర్నీల్లో ఆ జట్టు ఎప్పుడూ ఆడలేదు. కానీ ఇప్పుడా జట్టు మొదటిసారిగా మెగా టోర్నీలో అదృష్టం పరీక్షించుకోనుంది. గురువారం ఆఫ్రికా క్వాలిఫయర్‌ ఆఖరి మ్యాచ్‌లో రువాండాపై 9 వికెట్ల తేడాతో గెలిచిన ఆ జట్టు రెండో స్థానంలో (5 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు) నిలవడం ద్వారా ముందంజ వేసింది. మొదట రువాండా 18.5 ఓవర్లలో 65 పరుగులకే కుప్పకూలింది. ఉగాండా 8.1 ఓవర్లలో ఒక వికెటే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నమీబియా (5 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు) తర్వాత ఆఫ్రికా నుంచి టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా ఉగాండా నిలిచింది. జింబాబ్వే మరోసారి ప్రపంచకప్‌కు దూరమైంది.


ఏడు దేశాల మధ్య జరిగిన టోర్నీలో నమీబియా ఆడిన ఐదు మ్యాచుల్లో ఐదింటిని గెలుచుకుని పది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో అగ్ర‌స్థానంలో ఉన్న రెండు జ‌ట్లు వ‌ర‌ల్డ్ క‌ప్‌కు క్వాలిఫై అవుతాయ‌ని ఇదివ‌ర‌కే ఐసీసీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ కు  న‌మీబియా, ఉగాండాలు క్వాలిఫై అవ‌డంతో జింబాబ్వే, కెన్యా, నైజీరియా, టాంజానియా, రువాండాలు నిష్క్ర‌మించాయి. 


ఇక నమీబియా విషయాన్నికి వస్తే వరుసగా మూడో టి20 ప్రపంచకప్‌కు నమీబియా అర్హత సాధించింది. 2021, 2022, 2024 టీ 20 ప్రపంచ కప్‌లకు కూడా నమీబియా అర్హత పొందింది. నమీబియా  ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన న‌మీబియా  ఏడింట విజయాలు సాధించింది. ప‌ది పాయింట్లు సాధించి టీ 20 వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించింది.  ఉగాండా బ్యాటర్లలో సైమన్ సెసాజీ. రిజత్ అలీషా వంటి ప్లేయర్లు వేయికిపైగా రన్స్ చేశారు.


వ‌చ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ‌క‌ప్‌ వేదికలను ఐసీసీ ఖరారు చేసింది. అమెరికాలోని మూడు మైదానాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. డల్లాస్‌లోని గ్రాండ్‌ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ, న్యూయార్క్‌లోని నసౌ కౌంటీ స్టేడియాలను ఐసీసీ ఖరారు చేసింది. వెస్టిండీస్‌లోని మైదానాల్లోనూ మ్యాచ్‌లు నిర్వహించనుంది. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన క్రికెట్ స్టేడియాల్లో మాడ్యూలర్ విధానంలో సౌకర్యాలను కల్పించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నసౌ కౌంటీ స్టేడియంలో 34 వేల సీటింగ్ కెపాసిటీతో నిర్మించేందుకు ఇప్పటికే మాడ్యూలర్‌ స్టేడియం సొల్యూషన్స్‌తో అగ్రిమెంట్ చేసుకుంది. అమెరికాలో మూడు వేదికలను ప్రకటించడం ఆనందంగా ఉందని.. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలో అమెరికా భాగం కావడం ఆనందంగా ఉందని ఐసీసీ వెల్లడించింది.