ICC ODI WC 2023: కోటీ మంది అభిమానుల ఆశలను భగ్నం చేస్తూ స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్(World Cup) ఫైనల్లో టీమిండియా(Team India) పరాజయం పాలైంది. ఈ పరాభవం జరిగి రోజులు గడుస్తున్నా అభిమానులు మాత్రం మర్చిపోలేకపోతున్నారు. 2023 ప్రపంచకప్ కథ బాధగా ముగిసింది. ఇక అందరి దృష్టి 2027 ప్రపంచకప్‌పైకి దృష్టి మళ్లనుంది. నాలుగేళ్ల తర్వాత జరిగే ఆ టోర్నీ సరికొత్త అనుభూతి పంచబోతోంది.
ఈ ప్రపంచకప్‌తో నమ్మశక్యంగా లేకున్నా కొందరి కెరీర్ ముగిసిందనే చెప్పాలి. వయసు మీద పడే కొంతమంది ఆటగాళ్లు చివరి ప్రపంచకప్ ఆడేశారనే చెప్పాలి. భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అసలు సిసలు హీరో ఖచ్చితంగా సారధి రోహిత్ శర్మనే. రికార్డులు, శతకాల గురించి ఆలోచనే లేకుండా భారత్‌కు ప్రపంచకప్ అందించడానికి చేయాల్సిందంతా చేశాడు. రోహిత్ శర్మ విధ్వంసంతోనే టీమిండియా వన్డే ప్రపంచకప్ టైటిల్ కు అడుగుదూరంలో నిలిచిపోయింది. కానీ ఇప్పుడు మరో ప్రపంచకప్ రావాలంటే మరో నాలుగేళ్ల సమయం ఉంది. అప్పటివరకూ రోహిత్ శర్మ జట్టులో ఉంటాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ 2027 ప్రపంచకప్‌లో ఆడడం అంతే తేలిక కాదు. ఎందుకంటే రోహిత్ శర్మకు ఇప్పటికే 36 ఏళ్లు వచ్చేశాయి. అలాంటిది 2027 ప్రపంచకప్ నాటికి రోహిత్‌కు 40 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. 40 ఏళ్ల వయసులో రోహిత్ శర్మ వచ్చే ప్రపంచకప్‌లో జట్టులో ఉండడం అంత తేలికైన విషయమేమీ కాదు.
ఈ ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన మహ్మద్ షమీ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. మహ్మద్ షమీకి ప్రస్తుతం 33 ఏళ్లు వచ్చేశాయి. అంటే వచ్చే ప్రపంచకప్ నాటికి షమీ 37 ఏళ్ల వయసులో జట్టులో కొనసాగే అవకాశాలు దాదాపుగా లేనట్లే. రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రస్తుతం 37 ఏళ్లు. అంటే అశ్విన్‌కు ఇదే చివరి ప్రపంచకప్. రవీంద్ర జడేజాకు ప్రస్తుతం 34 ఏళ్లు. అంటే జడేజా కూడా వచ్చే ప్రపంచకప్‌లో కనిపించే అవకాశంలేదు. టీమిండియాలో ఫిట్‌నెస్ అంటే కోహ్లీ.. కోహ్లీ అంటేనే ఫిట్‌నెస్. కాబట్టి ఫిట్‌నెస్ విషయంలో వందకు వందశాతం ఫిట్‌గా ఉండే కోహ్లీ వచ్చే ప్రపంచకప్ ఆడే అవకాశం ఉంది. కోహ్లీకు ఇప్పుడు 35 ఏళ్లు. వచ్చే ప్రపంచకప్ నాటికి కోహ్లీకి 39 ఏళ్లు వచ్చేస్తాయి. అయినా పూర్తి ఫిట్‌గా ఉండే కోహ్లీ ఆ ప్రపంచకప్ ఆడే అవకాశం ఉంది. అంటే సీనియర్లు వీడ్కోలు బాటలో ఉండడంతో యువ ఆటగాళ్లు ఆ స్థానాలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
భవిష్యత్తు స్టార్‌గా అంచనా వేస్తున్న 24 ఏళ్ల శుభ్‌మన్ గిల్, ఈ ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన 28 ఏళ్ల శ్రేయస్స్ అయ్యర్... ఇప్పటికే ఓ డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్న 25 ఏళ్ల ఇషాన్ కిషన్... 26 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్.... విధ్వంసకర బ్యాటర్, వికెట్ కీపర్ 26 ఏళ్ల రిషభ్ పంత్ ఇక జట్టును నడిపించనున్నారు. ఈ యువ 2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో తమను తాము నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చాలామంది యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకున్నారు. ఒకవేళ రోహిత్ సహా సీనియర్లు రిటైర్‌మెంట్ ప్రకటిస్తే ఈ యువ ఆటగాళ్లు ఆ స్థానాలను వెంటనే భర్తీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే జట్టు సమతుల్యత దెబ్బతిని అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది. గొప్ప ఆటగాళ్ల వారసత్వాన్ని కొనసాగించడం ఆషామాషీ కాదు.
భవిష్యత్తు కెప్టెన్‌గా భావిస్తున్న శ్రేయస్స్ అయ్యర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రాబోయే నాలుగు సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని జట్టును అత్యంత జాగ్రత్తగా రూపొందించాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉంది. ఒత్తిడిని తట్టుకొని జట్టును లక్ష్యాన్ని చేర్చగలిగే సత్తా ఉన్న క్రికెటర్లను వెతికి పట్టుకోవాలి. జైస్వాల్, రుతురాజ్ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. స్పిన్నర్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అశ్విన్, జడేజా కెరీర్ చరమాంకంలో ఉన్న దశలో మంచి స్పిన్నర్ అవసరం టీంకు చాలా ఉంది. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, లెఫ్టామ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్‌లకు మరిన్ని చాన్సులివ్వాలి.