Tilak Varma News: ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల కాలంలో స్థిరంగా రాణిస్తున్న తిలక్ తన కెరీర్ ఉత్తమ ర్యాంకుకు చేరుకున్నాడు. 832 పాయింట్లతో తను ఈ స్థానం దక్కించుకున్నాడు. భారత్ తరపున నాలుగో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు కావడం విశేషం. గతంలో సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే అత్యధిక ఎలో రేటింగ్ పాయింట్లు సాధించారు. తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ కంటే కేవలం 23 పాయింట్ల దూరంలోనే తిలక్ ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఐదు టీ20ల సిరీస్ ఆడుతున్న తిలక్ చేతిలో మరో రెండు మ్యాచ్ లు ఉన్నాయి. ఆలోగా తను నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదే జరిగితే అతి పిన్న వయస్సులో టీ20 నెంబర్ 1 అయిన బాబర్ ఆజమ్ రికార్డును తిలక్ తుడిచిపెడతాడు.
దుమ్ము రేపిన వరుణ్..
గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్ లో విశేషంగా రాణిస్తున్న భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ లో కెరీర్ ఉత్తమ ర్యాంకుకు చేరుకున్నడు. తాజా ర్యాంకింగ్స్ లో తను ఏకంగా 25 ప్లేసులు ఎగబాకి టాప్-5లోకి చేరుకున్నాడు. మంగళశారం రాజకోట్ లో జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన సంగతి తెలిసిందే. వరుణ్ కెరీర్లో ఇది రెండో ఫైఫర్ కావడం విశేషం. గతేడాది సౌతాఫ్రికా పర్యటనలో కూడా తను ఫైఫర్ సాధించాడు. ఇక రాజకోట్ లో భారత్ ఓడిపోయనప్పటికీ వరుణ్ అత్యుత్తమ ప్రదర్శనకుగాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా కొల్లగొట్టాడు. భారత ఆల్ రౌండర్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా తాజా ర్యాంకింగ్స్ లో పురోగతి సాధించాడు. పది స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకును దక్కిచుకున్నాడు. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. 13 ర్యాంకులు మెరుగు పర్చుకుని ఆరో స్థానంలో నిలిచాడు. ఆదిల్ రషీద్ నెం.1 ర్యాంకులో నిలిచాడు.
అభిషేక్ జంప్..
విధ్వంసకర ఇన్నింగ్స్ లతో ఆకట్టుకుంటున్న భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ తాజా ర్యాంకింగ్స్ లో 40వ ర్యాంకు దక్కించుకున్నాడు. తను ఏకంగా 59 ప్లేసులు ఎగబాకాడు. ఇంగ్లాండ్ హిట్టర్లు లియామ్ లివింగ్ స్టన్ 32వ ర్యాంకులో, బెన్ డకెట్ 68వ ర్యాంకును దక్కించుకున్నాడు. ఇక టెస్టు ర్యాంకింగ్స్ లో బారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టాప్ లో కొనసాగుతున్నాడు. గతేడాదికి సంబంధించి పలు ఐసీసీ అవార్డులను బుమ్రా కొల్లగొట్టాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (డిసెంబర్), ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డులను తను కైవసం చేసుకున్నాడు. ఇక బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో జో రూట్ (ఇంగ్లాండ్) టాప్ ర్యాంకులో ఉన్నాడు.