కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఘన విజయం సాధించిన భారత్(Bharat) టెస్ట్ ఛాంపియన్ షిప్(Test Championship)లో అగ్రస్థానానికి చేరినా... ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్(ICC Test Ranking)లో మాత్రం రెండో స్థానానికే పరిమితమైంది. ప్రొటీస్‌తో సిరీస్‌కు ముందు ఆసీస్‌తో కలిసి భారత్ సంయుక్తంగా 118 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండేది. తొలి టెస్టులో ఓడిపోవడం.. రెండో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా గెలవడంతో సిరీస్ 1-1తో సమమైంది. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం పాకిస్థాన్‌పై మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో 118 పాయింట్లతో ఆస్ట్రేలియా(Austrelia) అగ్రస్థానంలో ఉండగా.... 117 పాయింట్లతో టీమిండియా(Team India) రెండో స్థానానికి పరిమితమైంది.
టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానం
టీమిండియా(Team India) సఫారీ గడ్డపై నయా చరిత్ర సృష్టించింది. కేవలం రోజున్నరలోనే ముగిసిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa)పై ఘన విజయం సాధించింది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టీమిండియా సీమర్లు నిప్పులు చెరిగిన వేళ రోహిత్ సేన విజయదుంధుభి మోగించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-2025 పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కొత్త సైకిల్‌లో భారత్ ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ఆడింది. ఇందులో రెండు మ్యాచుల్లో గెలవగా ఓ మ్యాచులో ఓడింది. మరో మ్యాచును డ్రా చేసుకుంది. భారత్ ఖాతాలో 26 పాయింట్లు ఉండగా 54.16 విజయ శాతంతో తొలి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా రెండో స్థానానికి పడిపోయింది. దక్షిణాప్రికా 12 పాయింట్లుతో 50.00 విజయశాతంతో రెండో స్థానంలో నిలిచింది. తరువాత వరుసగా న్యూజిలాండ్ మూడు, ఆస్ట్రేలియా నాలుగు, బంగ్లాదేశ్ అయిదో స్థానంలో నిలిచాయి. పాకిస్తాన్ ఆరో స్థానంలో.. వెస్టిండీస్ ఏడో స్థానంలో, ఇంగ్లాండ్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాయి. శ్రీలంక ఆఖరి స్థానంలో నిలిచింది.
కోహ్లీ ఒక్కడే
తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్ట్ బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ సత్తా చాటాడు. ఐసీసీ టెస్ట్ బ్యాటర్ ర్యాంకింగ్స్ (ICC Test Rankings)లో రన్ మెషీన్ విరాట్ కోహ్లి (Virat Kohli) తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. భారత్ నుంచి టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక బ్యాటర్ విరాటే కావడం విశేషం. దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టులో అర్ధ శతకంతో రాణించిన విరాట్... రెండో టెస్ట్‌లో 76 పరుగులు చేశాడు. గత రెండేళ్లలో కోహ్లీకి ఇదే మెరుగైన ర్యాంక్. ఐసీసీ టెస్ట్ బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ 12వ ర్యాంక్‌లో కొనసాగతున్నాడు. 2022లో కారు యాక్సిడెంట్ కారణంగా ఏడాదిపాటు ఆటకు దూరమైన పంత్ టాప్ 15లో ఒకడిగా నిలవడం విశేషం. మరోవైపు రోహిత్ శర్మ (Rohit Sharma) నాలుగు స్థానాలు దిగజారి 14వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. బంగ్లాదేశ్ సిరీస్‌లో నిలకడగా ఆడిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్, ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా నాలుగో స్థానంలో, బాబర్ ఆజాం ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.