ముంబై: దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని గెలుచుకున్న భారత జట్టు (Team India) స్వదేశానికి చేరుకున్నాక గ్రాండ్ వెల్‌కమ్ ఉంటుందని క్రికెట్ ప్రేమికులు భావించారు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ నెగ్గిన అనంతరం భారత్‌కు చేరుకున్న రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని జట్టుకు ఏ లెవెల్ లో ఘన స్వాగతం లభించిందో అందరూ చూశారు. అయితే ఈసారి అలాంటి సీన్ రిపీట్ అయ్యే అవకాశమే లేదు. వుమెన్ ప్రీమియర్ లీగ్ ఉండటంతో సెక్యూరిటీ ప్రాబ్లమ్ తలెత్తుతుందని ఆటగాళ్లకు గ్రాండ్ వెల్కమ్ లభించడం లేదు. మరోవైపు మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ మొదలు కానుంది. దాంతో ఆటగాళ్లు తమ స్వస్థలాలకు వెళ్లి, వెంటనే ఐపీఎల్ టీమ్ తో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టాల్సి ఉండటం మరో కారణంగా కనిపిస్తోంది.
భారత జట్టు 12 ఏళ్ల తరువాత ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత్ చివరగా ధోనీ కెప్టెన్సీలో 2013 ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. పుష్కరం కాలం తరువాత భారత్ ఈ మెగా ట్రోఫీని కైవసం చేసుకోవడంతో ఆటగాళ్లకు ఘన స్వాగతం ఉంటుందుని క్రికెట్ లవర్స్ భావించారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్, వాంఖడే స్టేడియంలో వారికి గ్రాండ్ రిసెప్షన్ లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ భారత ఆటగాళ్లు దుబాయ్ నుంచి వేర్వేరుగా బయలుదేరి స్వదేశానికి చేరుకుంటున్నారు.
ముంబై చేరుకున్న రోహిత్ శర్మదుబాయ్‌లో జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశానికి తిరిగొచ్చాడు. రోహిత్ శర్మ సోమవారం రాత్రి ముంబైకి చేరుకున్నాడు. టోర్నీ ఆసాంతం దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ మెరుపు ఆరంభాలు ఇచ్చి అంతే త్వరగా ఔటయ్యేవాడు. కానీ ఫైనల్లో మాత్రం జట్టు బ్యాటింగ్ బారాన్ని తన భుజాలపై మోశాడు. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో రోహిత్ శర్మ (76) స్టంపౌట్ అయ్యాడు. కానీ తాను ఆడిన కెప్టెన్ ఇన్నింగ్స్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ (62 బంతుల్లో 48) కీలక ఇన్నింగ్స్ తో మరోసారి ఆకట్టుకున్నాడు.
ఆదివారం జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత్ మరో 6 బంతులు మిగిలుండగానే 4 వికెట్ల తేడాతో ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. తద్వారా భారత జట్టు మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సాధించింది. అయితే ఈ ట్రోఫీని మూడోసారి నెగ్గిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. రాష్ట్రపతి ముర్ము సైతం భారత జట్టుకు విషెస్ తెలిపిన సందర్భంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
వన్డేలు ఇంకా ఆడతాను..తాను వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. తమపై అసత్యాలు ప్రచారం చేయవద్దన్న హిట్ మ్యాన్.. దుబాయ్ తమకు హోం గ్రౌండ్ కాదని, అభిమానుల మద్దతు పెరిగి హోం గ్రౌండ్ గా మారిందన్నాడు. సమష్టి కృషితో కప్పు సాధించాం. తమకు మద్దతు తెలిపిన అందరికీ కెప్టెన్ ధన్యవాదాలు తెలిపాడు. రోహిత్ శర్మ ఇక ఐపీఎల్ మీద ఫోకస్ చేసేందుకు ముంబై చేరుకున్న రోహిత్ తన జట్టుతో చేరనున్నాడు.