T20I Centuries Record: T20 ఇంటర్నేషనల్ ఫార్మాట్ వచ్చాక క్రికెట్‌లో వేగం పెరిగింది. ఒకప్పుడు వన్డేలో సెంచరీ అంటే ప్రత్యేకంగా ఉండేది. కానీ పొట్టి పార్మాట్లో 20 ఓవర్ల ఆటలో సెంచరీ సాధించడం చాలా మంది దిగ్గజాలకు ఇప్పటికీ ఒక సవాలుగా మారింది. కేవలం 120 బంతుల ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేయడానికి బ్యాటర్లకు క్లీన్ హిట్టింగ్, నిలకడ, టెక్నిక్ అవసరం. ఇటీవల కాలంలో T20 క్రికెట్‌లో అనేక విధ్వంసకర బ్యాటర్లు తెరపైకి వచ్చారు. వారు పరుగులు సాధించడమే కాకుండా, మెరుపు సెంచరీలు సాధించి బౌలర్లకు ముప్పు తెచ్చారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్, రోహిత్ శర్మ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.

Continues below advertisement

రోహిత్ శర్మ - భారత్

భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రిెకెట్లో 5 సెంచరీలతో గ్లెన్ మాక్స్‌వెల్‌తో కలిసి అగ్రస్థానంలో ఉన్నాడు. 2007లో T20 ఇంటర్నేషనల్‌లో అరంగేట్రం చేసిన రోహిత్ ఇప్పటివరకు 159 మ్యాచ్‌లలో 4,231 పరుగులు చేశాడు. హిట్ మ్యాన్ అత్యధిక స్కోరు 121 పరుగులు. 140 స్ట్రైక్ రేట్, 32 కంటే ఎక్కువ సగటుతో రోహిత్ చాలాసార్లు టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు.

Continues below advertisement

గ్లెన్ మాక్స్‌వెల్ - ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్, విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ T20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్లలో ఒకడు. 2012 నుండి 2025 వరకు ఆడిన 124 T20 మ్యాచ్‌లలో మాక్సీ 5 అద్భుతమైన సెంచరీలు చేశాడు. అతడి అత్యుత్తమ స్కోరు 145 పరుగులు కాగా, ఫార్మాట్లో మొత్తం 2833 పరుగులు చేశాడు. 156 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధిస్తూ మాక్స్‌వెల్ T20 ఫార్మాట్‌లో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.

ఫిల్ సాల్ట్ - ఇంగ్లాండ్

ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ ఫిల్ సాల్ట్ ఇటీవల అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఫిల్ సాల్ట్ కేవలం 50 మ్యాచ్‌లలోనే 4 సెంచరీలు సాధించాడంటే అతడు ఏ స్థాయిలో చెలరేగుతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాల్ట్ స్ట్రైక్ రేట్ 168 కంటే ఎక్కువ. ఇది ఈ ఫార్మాట్‌లో కనీసం 50 మ్యాచ్‌లాడిన ఏ బ్యాట్స్‌మెన్‌కైనా అత్యధికం. ఫిల్ సాల్ట్‌ను ఇంగ్లాండ్ జట్టుకు టీ20 స్పెషలిస్ట్ అని భావిస్తారు. 

సూర్యకుమార్ యాదవ్ - భారత్

టీమిండియా 'మిస్టర్ 360 డిగ్రీ' ఆటగాడిగా పిలుచుకునే సూర్యకుమార్ యాదవ్ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ సూర్య ఇప్పటివరకు 90 మ్యాచ్‌లలో 2670 పరుగులు చేయగా, ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. 164 స్ట్రైక్ రేట్, 37 సగటుతో సూర్య T20 క్రికెట్‌లోని అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. 

డేరియస్ విస్సర్ - సమోవా

సమోవాకు చెందిన డేరియస్ విస్సర్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. విస్సర్ కేవలం 17 మ్యాచ్‌లలో 3 సెంచరీలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పొట్టి ఫార్మాట్‌లో విస్సర్ ఇప్పటివరకు 578 పరుగులు చేశాడు. అతని సగటు 41 కంటే ఎక్కువ, కాగా స్ట్రైక్ రేట్ 150 పైగా ఉంది.