T20 World Cup Semi Final Teams List: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరిన నాలుగు జట్లు ఖరారయ్యాయి. ఆదివారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై భారత జట్టు 5 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఓపెనర్ సంజూ శాంసన్ 97 పరుగుల అజేయ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి, ఇండియాను సెమీఫైనల్‌కు చేర్చారు. సెమీఫైనల్‌లో చోటు దక్కించుకున్న నాలుగో జట్టు భారత్. భారత్‌తో పాటు ఫైనల్-4 బెర్త్ దక్కించుకున్న మిగిలిన మూడు జట్లు ఏవి,  సెమీఫైనల్ మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈ నాలుగు జట్లే సెమీఫైనలిస్టులు 

భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్స్ చేరాయి. భారత్ కంటే ముందే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్,  న్యూజిలాండ్ సెమీఫైనల్‌లో తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. సూపర్-8లోని మొదటి గ్రూప్ నుండి భారత్,  దక్షిణాఫ్రికా జట్టు సెమీస్ చేరగా, రెండో గ్రూప్ నుండి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తుది-4లో చోటు దక్కించుకున్నాయి. ఆసియా నుంచి చాలా దేశాలు టోర్నీ ఆడినా కేవలం భారత్ మాత్రమే సెమీఫైనల్స్ చేరుకోవడం విశేషం.

దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌ చేరుకున్నాయి. మార్చి 1న రాత్రి ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచులో ఇండియా ప్రత్యర్థి వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ 4లో చోటు దక్కించుకుంది. ఇక సూపర్-8 మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు శ్రీలంకను 65 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ తేడాతో ఓడించలేకపోవడంతో న్యూజిలాండ్ సెమీఫైనల్స్ చేరిందని తెలిసిందే. 

భారత్ మ్యాచ్ ఎవరితో ఆడుతుంది

2026 టీ20 వరల్డ్ కప్ మొదటి సెమీఫైనల్ మ్యాచ్ మార్చి 4న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదిక కానుంది. ఇందులో విజేత తొలి ఫైనలిస్ట్ అవుతుంది.

రెండో సెమీఫైనల్ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతుంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. రెండో ఫైనలిస్ట్ డిసైడ్ చేసే మ్యాచ్ ఇది.

  • మొదటి సెమీఫైనల్ - దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య మార్చి 4 (కోల్‌కతా)

  • రెండో సెమీఫైనల్ - భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మార్చి 5 (ముంబై వేదికగా)

రెండు సెమీఫైనల్స్‌లో గెలిచిన జట్లు మార్చి 8న టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో తలపడతాయి. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో జరుగుతుంది. ఇప్పటి వరకు చరిత్రలో ఏ జట్టు కూడా వరుసగా రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ గెలవలేదు. అయితే సెమీస్ లో ఇంగ్లాండ్ మీద నెగ్గి, ఫైనల్లోనూ విజయం సాధిస్తే వరుసగా రెండు సార్లు పొట్టి ప్రపంచ కప్ నెగ్గిన తొలి జట్టుగా భారత్‌ చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుంది.